హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో తిరుగులేని చరిష్మా ఎన్టీవీ చౌదరిది. వరుసగా మూడు సార్లు పోటీచేసి.. విజయఢంకా మోగించిన వ్యక్తి. అయితే రూల్స్ ప్రకారం మూడు సార్లు కంటే ఎక్కువ పోటీ చేయకూడదు కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అయితే ఆయన మద్దతుదారులు పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక ఆయన వర్గీయులు ఓడిపోయినప్పటి నుంచి గెలిచిన వర్గం సోషల్ మీడియాలో చౌదరిపై బురదచల్లే ప్రయత్నం చేస్తోంది.
గతంలో చౌదరి హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. సీసీ కెమెరాలనుంచి మొదలు కొంటే.. ఎన్ఆర్ ఐల భూముల రక్షణ, పార్కులు, విద్యాసంస్థల అభివృద్ధి లాంటి ఎన్నో కార్యక్రమాలు జరిపారు చౌదరి. కానీ ఇప్పుడు కొత్తగా గెలిచిన వర్గం ఆయనలా పనిచేయడం మానేసి.. పుకార్లు పుట్టిస్తూ సోషల్ మీడియలో పోస్టులు చేస్తున్నారు. గతంలో సొసైటీ పరిధిలోని ఓ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చౌదరి వర్గీయులు ఆగ్రహం తెలుపుతున్నారు. 2007, 2011లో కోర్టు తీర్పుకు లోబడే ఆ రిజిస్ట్రేషన్ జరిగిందని చౌదరి మద్దతుదారులు తెలుపుతున్నారు. ఇక గెలిచిన వర్గం ఈ విషయంపై కోర్టుకు వెళ్లగా కోర్టు కూడా దీన్ని కొట్టివేసింది. అయితే కేసు కోర్టులో ఉండగా పూర్తి తీర్పు రాకముందే.. అందుకు సంబంధించిన పేపర్లను వాట్సాప్ లలో షేర్ చేస్తూ పుకార్లు పుట్టించే ప్రయత్నం చేశారని చౌదరి వర్గీయుల ఆరోపణ.
అంటే వారు చేసిన ఆరోపణలు తప్పని కోర్టు చెప్పిందన్నమాట. ఇంత జరిగినా వారు చౌదరిపై బురద చల్లడం మానట్లేదు. ఇక వీరికి ఓ ఛానల్ కూడా సపోర్టు చేస్తోంది. అయితే చౌదరి కోటి దీపోత్సవం లాంటి కార్యక్రమాలతో పేరు తెచ్చుకుంటే ఓర్వలేకనే ఇవన్నీ చేస్తున్నారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. కాగా చౌదరి మాత్రం ఎన్టీవీ, భక్తి టీవీలకు ఓటీటీ తెచ్చే పనిలో బిజీగా ఉన్నారని, ఇలాంటి తప్పుడు ఆరోపణలు పట్టించుకునే స్థితిలో లేరని తెలుస్తోంది. ఇకనైనా ఎన్టీవీ చౌదరిగారికి ఉన్న పేరును దెబ్బతీయాలని చూడటం మానేసి, సొసైటీకి పనిచేయాలని ఆయన అభిమానులు సూచిస్తున్నారు.