ఓడినా,గెలిచినా ఆ రోజు ప్రజల మధ్యే ఉన్నారు.ఇవాళ కూడా ఆయన అలానే ఉండనున్నారు. అవమానాలు దాటుకుని ప్రయాణిస్తూ మంచి ఫలితాల సాధన కోసం శక్తి వంచనలేకుండా పనిచేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఫోకస్ ఇది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గత కొంత కాలంగా ఒంటరి పోరాటమే సాగిస్తున్నారు.స్వశక్తిని నమ్ముకుని నిలబడేందుకే ప్రయత్నిస్తున్నారు. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరిస్తూ కార్యకర్తలను కలుపుకుని పోతున్నారు. మొదట నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారికి తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆ క్రమంలో విజయవంతం అయ్యారు కూడా! గతంలో మాదిరిగా కాకుండా కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే వాలిపోతున్నారు.
క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారం అన్నది ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నారు. పల్నాడులో హత్యకు గురయిన తోట చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకున్నా రు. పాతిక లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా పార్టీ తరఫున అందించి, బాధిత కుటుంబానికి అండగా ఉన్నారు.
ఇక పార్టీలో కొత్త నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు.యువ నాయకత్వంతో పనిచేయిస్తూనే,కొత్త తరంతో పాటు పాత తరం కూడా ముఖ్యమే అన్న భావనతో ఇరువర్గాల సమన్వయం చేసుకుని పనిచేస్తున్నారు.గతంలో మాదిరిగా కాకుండా ఎక్కువ సమయం పార్టీకే కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమ కార్యాచరణలో ఆయన ఎప్పటికప్పుడు ముందుంటు న్నారు.శ్రేణులకు ఉత్సాహం ఇస్తూ, ప్రజా ఉద్యమాల ఆవశ్యకతను ఎప్పటికప్పుడు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు.వచ్చే ఎన్నికలకు సంబంధించి కొత్త ముఖాలను కొందరిని తెరపైకి తీసుకువచ్చి వారికి రాజకీయ జీవితం ప్రసాదించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు.
వైసీపీ మాదిరిగానే టీడీపీ కూడా వలంటీర్ వ్యవస్థను డెవలప్ చేయాలని చూస్తే అందుకు బాబు కొన్ని మార్గనిర్దేశకాలు కూడా ఇచ్చారు. త్వరలోనే ప్రతి వంద ఇళ్లకూ ఓ వలంటీర్ పార్టీ తరఫున పనిచేసేందుకు సిద్ధం కావాలని ఇప్పటికే పిలుపు ఇచ్చారు. వీరికి పార్టీ తరఫున కొంత గౌరవ వేతనం అందివ్వనున్నారు. అంతేకాదు వారిని అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తరఫున సముచిత ప్రాధాన్యం దక్కేలా చేయనున్నారు. ఇవే కాకుండా టీడీపీ సంస్థాగత బలోపేతానికి సీనియర్లతో ఎప్పటికప్పుడు భేటీ అవుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ ను దీటుగా ఎదుర్కొనేందుకు,క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు మరింత తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు బాబు. మరోవైపు బాలయ్య ఓ స్టార్ క్యాంపైనర్ గా ఉండనున్నారు. లోకేశ్ కూడా పార్టీ కార్యకలాపాలను పూర్తిగా అధ్యయనం చేసి ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమై నాన్నకు అండగా ఉండేందుకు సిద్ధం అవుతున్నారు. ఏదేమైనప్పటికీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటమే తమ పరమావధి అన్న విధంగా పనిచేసేందుకు అటు లోకేశ్ కానీ ఇటు చంద్రబాబు కానీ సన్నద్ధం అవుతున్నారు అని చెప్పడంలో రెండో ఆలోచనకు తావేలేదు. ఇక యుద్ధమే మిగిలి ఉంది.