ఆమె ఎస్టీనే కాదు.. గిరిజన శాఖ ఎలా ఇస్తారు.. ఏపీ మంత్రి పుష్పశ్రీవాణిపై ఆరోపణలు

ఏపీ మంత్రివర్గంలో సీఎం జగన్ ముగ్గురు మహిళలకు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. మొత్తం 25 మంది మంత్రుల్లో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం కల్పించారు జగన్. వారిలో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి ఎస్టీ కోటాలో మంత్రి పదవి దక్కింది. ఆమె ఎస్టీ కావడంతో ఆమెకు గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖను కేటాయించారు.

అయితే.. ఆమె ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి. ఆమె ఎస్టీ కాదంటూ ఏపీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి అప్పలనర్స సంచలన ఆరోపణలు చేశారు. ఆమె కులానికి సంబంధించిన వివాదం ఇప్పటిది కాదని.. ఆ వివాదానికి సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉందని.. అటువంటప్పుడు ఆమెకు ఎస్టీ కోటా కింద మంత్రి పదవిని ఎలా కట్టబెట్టారంటూ ఆయన ఫైర్ అయ్యారు. అది కూడా గిరిజన సంక్షేమ శాఖను ఆమెకు కేటాయించడంపై అప్పలనర్స తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పుష్పశ్రీవాణి సోదరి రామతులసి కూడా ఎస్టీ కాదని చెప్పి ఆమెను టీచర్ జాబ్ నుంచి తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

జగన్ కేబినేట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న పాముల పుష్పశ్రీవాణి.. అతి పిన్న వయస్కురాలు. ఆమె ఒకప్పుడు టీచర్‌గా పనిచేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ తరుపున పోటీ చేసి రెండు సార్లు ఆమె విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె వయసు 31 ఏళ్లు.