నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఆడం జంపా పదే పదే చేతులను జేబులో పెట్టుకుంటూ అనంతరం వాటిని బయటకి తీసి బాల్‌ను రుద్దుతూ కనిపించాడు.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నమెంట్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన విషయం విదితమే. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా బాల్ ట్యాంపరింగ్ చేశారని అభిమానులు ఆరోపిస్తున్నారు. అందుకు గాను మ్యాచ్ సందర్భంగా దొరికిన పలు ఫుటేజ్‌లను వారు సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. ఆడం జంపా బాల్‌ను ట్యాంపరింగ్ చేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని భారత క్రికెట్ అభిమానులు ఐసీసీని డిమాండ్ చేస్తున్నారు.
నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఆడం జంపా పదే పదే చేతులను జేబులో పెట్టుకుంటూ అనంతరం వాటిని బయటకి తీసి బాల్‌ను రుద్దుతూ కనిపించాడు. కెమెరా ఫుటేజ్‌లో ఆ దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి కూడా. దీంతో ఆడం జంపా ప్రవర్తించిన తీరు అనుమానాస్పదంగా మారింది. ఈ క్రమంలో ఆడం జంపా అలా చేతులు జేబులో పెడుతూ.. అనంతరం వాటిని బయటకు తీసి బాల్‌ను రుద్దుతూ కనిపించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఆడం జంపాపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని భారత అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
Whats in the pocket Zampa??? Are Australia upto old tricks again? pic.twitter.com/MPrKlK2bs9
— Peter Shipton (@Shippy1975) June 9, 2019
అయితే మరోవైపు ఈ ఘటనపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫించ్ స్పందించాడు. ఆడం జంపాకు ఒక విచిత్రమైన అలవాటు ఉందని.. అతను తన చేతులను వెచ్చగా ఉంచుకునేందుకు జేబులో పలు పరికరాలను పెట్టుకుంటాడని.. అంతే తప్ప అతను బాల్ ట్యాంపరింగ్ చేసి ఉండడని తాను భావిస్తున్నానని ఫించ్ అన్నాడు. అయితే మరి.. జేబులో చేతులను పెట్టుకున్న వెంటనే వాటిని బయటకు తీసి బాల్‌ను రుద్దడం ఎందుకు..? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఏది ఏమైనా.. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యులను అంత సులభంగా నమ్మలేం. వారు గెలిచేందుకు ఎన్ని కుయుక్తులనైనా పన్నుతుంటారు. ఈ విషయంలో ఐసీసీ కొంచెం దృష్టి సారిస్తే మంచిది. లేదంటే ఆసీస్ చీటింగ్‌కు ఇతర జట్లు బలి కావల్సి వస్తుంది..!