సాధారణంగా ఏపీ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎక్కువ ఉంటుంది గానీ, తెలంగాణ రాజకీయాల్లో అంతగా ఉండేది కాదు. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణలో కూడా కులాల మీద ఆధారపడే రాజకీయాలు నడిచే పరిస్తితి వచ్చింది. తెలంగాణ విడిపోయి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి క్యాస్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.
అయితే తెలంగాణ వచ్చాక జరిగిన రెండు ఎన్నికల్లో దాదాపు అన్నీ వర్గాలు కేసీఆర్ పట్ల పాజిటివ్‌గా ఉండటంతో టీఆర్ఎస్ గెలుస్తూ వచ్చింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి ఉండేలా కనిపించడం లేదు. ఈ సారి క్యాస్ట్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయేలా ఉన్నాయి. పలు ప్రధాన వర్గాలు కేసీఆర్‌కు హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాయి. అసలు కేసీఆర్ సొంత వర్గమైన వెలమలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. కానీ తెలంగాణలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీల సపోర్ట్ కేసీఆర్‌కు దక్కింది. అలాగే తెలంగాణ రాజకీయాలని బాగా ప్రభావితం చేయగల కమ్మ వర్గం కూడా కేసీఆర్ వైపుకే వచ్చింది. అటు రెడ్డి వర్గం కూడా కాస్త సపోర్ట్ వచ్చింది.
అందుకే కేసీఆర్ రెండుసార్లు సులువుగా అధికారంలోకి వచ్చారు…కానీ ఈ సారి అటు కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి, ఇటు బీజేపీలో ఈటల రాజేందర్ ప్రభావంతో కుల సమీకరణాలు పూర్తిగా మారినట్లు కనిపిస్తున్నాయి. పైగా కేసీఆర్ అధికారంలోకి వచ్చాక బీసీలకు ఒరిగింది లేదు…ఇక అటు ఈటల ఎలాగో బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో…బీసీల్లో కొన్ని వర్గాలు బీజేపీ వైపుకు వెళ్ళేలా ఉన్నాయి. ముఖ్యంగా ముదిరాజ్‌లు. అటు గౌడ వర్గం కాంగ్రెస్ వైపుకు వచ్చేలా ఉంది. అలాగే ఈ సారి రెడ్డి వర్గం పూర్తిగా రేవంత్‌కు మద్దతు ఉండేలా ఉంది.
ఇక గతంలో టీడీపీలో కీలకంగా ఉండే కమ్మ వర్గం..ఆ తర్వాత కేసీఆర్‌కు సపోర్ట్ ఇచ్చింది…కానీ ఇప్పుడు రేవంత్ ప్రభావంతో వారు…కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లో కాంగ్రెస్‌కే ఎక్కువ మద్ధతు ఉంది. వారిని తిప్పుకోవడానికి దళితబంధుని కేసీఆర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికైతే రేవంత్, ఈటల ప్రభావం వల్ల కేసీఆర్‌కు డ్యామేజ్ గట్టిగానే జరిగేలా ఉంది.