పొత్తుల కోసం ఎవరితోనూ సంప్రదించాల్సిన అవసరం లేదని.. ఒకవేళ ఎవరైనా అడిగితే ఆలోచిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. సీపీఐకి గట్టి పట్టున్న ఐదు స్థానాలతో పాటు హుస్నాబాద్లో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. పార్టీ బలం ఉన్న ప్రతిచోట అభ్యర్థులను నిలబెడతామని.. మతోన్మాద బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇంతకుముందు లాగానే పొత్తులు అంటూనే ఎలాంటి సంప్రదింపులు జరపకుండా సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. మా బలం ఉన్న ప్రతి చోట అభ్యర్థులను నిలబెట్టి మతోన్మాద బీజేపీ పార్టీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. కమ్యూనిస్టు పార్టీలను సంప్రదించకుండానే సీఎం కేసీఆర్ 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. మునుగోడు బైపోల్‌లో పెట్టుకున్న పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని లెఫ్ట్ పార్టీలు భావించి భంగపడ్డాయి. వామపక్షాల పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే కేసీఆర్.. అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ పరిణామంపై కామ్రేడ్లు మండిపడ్డారు. అనంతరం సీపీఐ, సీపీఎం పార్టీలు సమావేశమై గెలిచే స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.