కంచుకోటలో పార్టీ పుట్టి ముంచుతున్న చంద్రబాబు ప్రయోగాలు

-

టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి ఒకటి. పార్టీ ఎన్ని ఒడిదుడుకులకు లోనైనా ఈ జిల్లా మాత్రం సైకిల్ పార్టీకి ఎప్పుడూ అండగా నిలిచింది.అలాంటి జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో ప్రయోగాలు చేశారు పార్టీ అధినేత చంద్రబాబు. అలా ప్రయోగాలు చేసిన నియోజకవర్గాల్లో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా చేజారిందట..సరిదిద్దుకుందామన్నా.. దారికి రావడం లేదట. ఇంతకీ టీడీపీ ప్రయోగాలు ఎందుకు బెడిసి కొట్టాయి?

 

రసవత్తర రాజకీయాలకు వేదికయిన పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీలకు ఈ జిల్లా ఎంత ముఖ్యమో.. నాయకులు కూడా ఆయా పార్టీలకు అంతే ముఖ్యం. ఇదే ఉద్దేశంతో తమకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ప్రయోగాలు చేసింది టీడీపీ. అవే చింతలపూడి, తాడేపల్లిగూడెం. ఉద్దండులైన నాయకులు ఈ నియోజకవర్గాల నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించారు. కాలక్రమంలో రిజర్వేషన్లు మారడం.. కొత్త నేతలు తెరపైకి రావడంతో మిశ్రమ ఫలితాలు తప్పలేదు.

కోటగిరి విద్యాధరరావు ఉన్నంతకాలం చింతలపూడిలో టీడీపీదే హవా. రిజర్వేషన్ల ప్రభావంతో ఆయన చింతలపూడిని వీడటంతో టీడీపీకి ఇక్కడ బ్యాడ్‌ డేస్‌ మొదలయ్యాయి. తర్వాతి కాలంలో విద్యాధరరావు పీఆర్పీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో పీతల సుజాతను చింతలపూడి నుంచి రంగంలోకి దింపిన టీడీపీ మళ్లీ జెండా ఎగరేసింది. సుజాతను మంత్రిని చేశారు చంద్రబాబు. అయితే నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహించారని సుజాతపై ఆరోపణలు వచ్చాయి. సీనియర్లు అనుకున్నవారంతా నాటి ఏలూరు ఎంపీ మాగంటి బాబు శిబిరంలోకి వెళ్లిపోయారు. ఈ విభేదాలతో ఆ సమయంలో AMC చైర్మన్‌ నియామకం కూడా చేపట్టలేదు.

2019లో చింతలపూడి టికెట్‌ సుజాతకు నిరాకరించి కర్రా రాజారావుకు ఇచ్చారు చంద్రబాబు. రాజారావు ఇక్కడ బలమైన అభ్యర్థే అయినప్పటికీ టీడీపీలోని వర్గాల వైసీపీకి కలిసి వచ్చాయి. వైసీపీ అభ్యర్థి ఎలీజా గెలిచారు. ప్రస్తుతం చింతలపూడి టీడీపీ ఇంఛార్జ్‌గా రాజారావు కొనసాగుతున్నా పార్టీలో చురుకు లేదట. వయసు మీద పడటంతోపాటు అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని కేడర్‌ నుంచి విమర్శలు వస్తున్నాయట. ఇక్కడి విషయాలను గమనిస్తున్న టీడీపీ అధిష్ఠానం ఇంఛార్జ్‌గా కర్రా రాజారావును కొనసాగిస్తుందో లేక కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తుందో అన్న చర్చ జరుగుతోంది.

తాడేపల్లిగూడెంలోనూ టీడీపీ అనేక ప్రయోగాలు చేసింది. 2009లో పీఆర్పీ నుంచి గెలిచిన ఈలి నాని తర్వాత టీడీపీ కండువా కప్పుకొన్నారు. 2014లో నానికే టికెట్‌ ఇస్తారని అనుకున్న సమయంలో పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చింది టీడీపీ. ఇక్కడ నుంచి పైడికొండల మాణిక్యాలరావు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేశారు. పొత్తు వికటించడంతో టీడీపీ నుంచి ఈలి నాని బరిలో దిగినా వైసీపీ గాలిలో నెగ్గుకు రాలేకపోయారు. ప్రస్తుతం నానినే తాడేపల్లిగూడెం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసి బొల్లినేని శ్రీనివాస్‌ సైతం నాడు టీడీపీ టికెట్‌ ఆశించినా పార్టీ పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో ఆయన టీడీపీకి హ్యాండిచ్చి జనసేనలో చేరిపోయారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు బొల్లినేని.

తాడేపల్లిగూడెంలో టీడీపీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గానికి చెందిన బీసీ నేత గొర్ల శ్రీధర్‌ను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీని చేశారు చంద్రబాబు. అలాగే నల్లజర్లకు చెందిన ముళ్లపూడి బాపిరాజు జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఇక్కడ బీసీ, కాపు, కమ్మ సామాజికవర్గాల సమతూకంతో పదవులు, ప్రాధాన్యాలు ఇచ్చినా చొరవ తీసుకుని టీడీపీని పట్టించుకునే నాయకుడు లేదన్నది కేడర్‌ మాట. మరి.. చింతలపూడి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో టీడీపీ పుంజుకోవడానికి చంద్రబాబు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news