ఏపీ పోలీసుల కంటే బ్రిటీష్ వాళ్లే నయమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. పోలీసులు సరిగా పనిచేయకుంటే ప్రజా తిరుగుబాటు ఖాయమని హెచ్చరించారు. కుప్పంలో తన రెండో రోజు పర్యటనకు వైకాపా అడ్డంకులు సృష్టించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తలు అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేయడం, తెదేపా ఫ్లెక్సీల చించివేయడంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బస్టాండ్ వద్ద రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా, పోలీసుల తీరుపై మండిపడ్డారు.
ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే వైకాపా ఈ తరహా ఘటనలకు పాల్పడుతోందన్నారు. వైకాపా పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని.. కుప్పం నుంచే ధర్మపోరాటానికి నాంది పలుకుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. బుధవారం రామకుప్పం మండలంలో జరిగిన తన సమావేశం వద్ద వైకాపా జెండాలు ఎగురవేస్తారా? అని మండిపడ్డారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. పట్టణంలో శాంతిభద్రతలు కాపాడాలని.. వైకాపా గూండాలకు వత్తాసు పలకొద్దని పోలీసులను కోరారు. రౌడీలు, గూండాలను అణచివేసిన పార్టీ తెదేపా అని చెప్పారు.