ప‌య్యావుల‌ని మ‌రిచారెందుకో!

 

టీడీపీ ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన క‌మిటీల‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఈ సోమ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా అచ్చ‌న్నాయుడిని నియ‌మించిన చంద్ర‌బాబు 27 మందితో సెంట్ర‌ల్ క‌మిటీని, 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరోని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో కొంత మంది మిస్ కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

ఇందులో ప్ర‌ధానంగా ప‌య్యావుల కేశ‌వ్‌తో పాటు మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు పేరు కూడా క‌నిపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గంటా శ్రీ‌నివాస‌రావు గ‌త కొంత కాలంగా టీడీపీ పార్టీకి దూరంగా వుంటూ వ‌స్తున్నారు. పైగా ఆయ‌న వైఎస్సార్ సీపీలో చేర‌బోతున్నారంటూ జోరుగా ప్ర‌చారం కూడా జ‌రుగుతుండ‌టంతో ఆయ‌న‌ని బాబు ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

పార్టీకి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు అత్యంత విధేయుడిగా వుంటున్న ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే ప‌య్యావుల‌ని ఎలా ప‌క్క‌న పెట్టార‌న్న‌ది మాత్రం అంతుచిక్క‌డం లేద‌ట‌. గ‌త కొంత కాలంగా ప‌య్యావుల పార్టీలో యాక్టివ్‌గా వుండ‌టం లేదు. అధినేత‌తో విభేధాల కార‌ణంగానే ప‌య్యావుల పార్టీలో త‌న గొంతుని వినిపించ‌డం లేద‌ని, యాక్టివ్‌గా వుండ‌టం లేద‌ని చెబుతున్నారు. ఆ కార‌ణంగానే చంద్ర‌బాబు నాయుడు ఉర‌వ‌గొండ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్‌ని ప‌క్క‌న పెట్టిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.