నందమూరి సుహాసిని కెరీర్‌కు బాబు భరోసా ఇస్తారా?

తెలుగుదేశం పార్టీ స్థాపించింది నందమూరి తారకరామారావు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలిసిన విషయమే. అలాగే ఎన్టీఆర్‌ని గద్దె దింపి చంద్రబాబు టీడీపీ పగ్గాలు, అధికార పీఠాన్ని దక్కించుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ఎప్పుడైతే చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిందో అప్పటినుంచి ఆ పార్టీలో నందమూరి ఫ్యామిలీకి పెద్ద స్కోప్ లేకుండా పోయింది.

నందమూరి సుహాసి | Nandamuri Suhasini

కానీ నందమూరి అభిమానులతో ఇబ్బంది రాకూడదని మొదట నందమూరి హరికృష్ణకు చంద్రబాబు కాస్త ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన తర్వాత పార్టీలోకి బాలకృష్ణ వచ్చారు. ప్రస్తుతం బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే బాలయ్య, బాబుకు వియ్యంకుడు కూడా.  ఇక హరికృష్ణ చనిపోయాక టీడీపీలోకి ఆయన కుమార్తె సుహాసిని వచ్చారు.

సుహాసిని ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. 2018 తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సమయంలోనే హరికృష్ణ కుటుంబానికి చెందిన సుహాసినిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అలాగే టీడీపీ తరుపున కూకట్‌పల్లిలో నిలబెట్టారు. అయితే ఊహించని విధంగా సుహాసిని ఓడిపోయారు. ఇక ఆ ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్తితి ఏమైందో అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఆ పార్టీ కథ దాదాపు ముగిసిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సైతం వేరే పార్టీలోకి జంప్ చేయడం ఫిక్స్ అయిపోయింది. రమణ కూడా వెళ్లిపోతే తెలంగాణలో టీడీపీ జెండా కనిపించడం కష్టం.

మరి అలాంటి పార్టీలో సుహాసిని ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అలా అని సుహాసినికి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు లేవు. నెక్స్ట్ ఎన్నికల్లో సుహాసిని టీడీపీ తరుపున నిలబడిన గెలవడం అసాధ్యమని అర్ధమవుతుంది. ఇంకా ఏదైనా ఛాన్స్ ఉంటే సుహాసినిని ఏపీ రాజకీయాల్లోకి తీసుకురావాలి. మరి సుహాసిని పోలిటికల్ కెరీర్‌ని బాబు ఎలా నిలబెడతారో చూడాలి.