అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. దీనిపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న ఆయన జిల్లాల అధ్యక్షులను కూడా మారుస్తున్నారని సమాచారం. తాజాగా ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఖరారు చేశారు. అయితే ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. జిల్లాలో వైసీపీని చక్కదిద్దాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టాస్క్ ఇచ్చారు జగన్. దీంతో జిల్లా నేతలు, కార్యకర్తలతో చెవిరెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాత కమిటీలన్నింటినీ రద్దు చేసి కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేసే పనిలో చెవిరెడ్డి బిజీగా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లాకు సంబంధం లేదు. అయినా ఆయనకు జగన్ ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన తన సొంత జిల్లా తిరుపతికి వెళ్లిపోతారేమో అనుకున్నారు. కానీ ప్రకాశం జిల్లా నేతగానే స్థిరపడిపోవాలని చెవిరెడ్డి డిసైడైపోయారు.
తొలిసారి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు .వైసీపీ ఓడినా జగన్ వెంట ఉన్నారాయన. తిరిగి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై 41 వేలకుపైగా ఓట్ల తేడాతో చెవిరెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని భావిచారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో చెవిరెడ్డికి జగన్ కేబినెట్లో చోటు దక్కలేదు. మంత్రి పదవి లభించకపోయినప్పటికీ చెవిరెడ్డికి ఒకటికి నాలుగు పదవులు దక్కాయి.
చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ప్రభుత్వ విప్ పదవి దక్కింది. 2019లోనే తుడా ఛైర్మన్ పదవి రాగా, 2021లో టీటీడీ పాలక మండలిలో ఎక్స్ అఫియో సభ్యుడిగా సభ్యత్వం లభించాయి. జగన్‌తో తనకున్న చనువును ఉపయోగించుకొని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి టికెట్‌ను చెవిరెడ్డి ఇప్పించుకోగలిగారు.
వారసుడు రాజకీయాల్లోకి రావడంతో చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరును జగన్ ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీలో చేరగా బలమైన అభ్యర్థిని అక్కడ పోటీలో ఉంచాలని భావించిన జగన్… చెవిరెడ్డి భాస్కర రెడ్డికి ఒంగోలు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి ఎంపీ టికెట్ ఇచ్చారు.
సంతనూతలపాడు, కావలి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాంతీయ సమన్వయకర్తగానూ చెవిరెడ్డి వ్యవహరించారు. ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీలో కీలక నేతలైన వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డిలను సమన్వయం చేసుకుంటూ చెవిరెడ్డి ముందుకు సాగుతున్నారు. కాగా ఆయన జిల్లా అధ్యక్షులు కానున్నారని తెలిసిన కార్యకర్తలు కూడా బలమైన నాయకత్వం దొరికిందని అంటున్నారు. రానున్న ఐదేళ్లలో పార్టీని మరింత బలంగా మారుస్తామని చెప్తున్నారు.