ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖలోని శారదా పీఠం చేరుకున్నారు. నేడు శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో జగన్ పాల్గొననున్నారు.పూర్ణకుంభంతో వేదపండితులు ఆయనకు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం వైఎస్ జగన్ స్వరూపానందేంద్ర స్వామివారికి ఫలాలు సమర్పించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకుని.. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారికి జగన్ పూజలు నిర్వహించనున్నారు. ఆగమ యాగశాలలో ఐదు రోజులుగా విశ్వశాంతి హోమం జరుగుతోంది. ఈ హోమం పూర్ణాహుతిలో జగన్ పాల్గొంటారు. స్వయంజ్యోతి మండపాన్ని ప్రారంభిస్తారు.
అలాగే శారద పీఠంలో సుమారు రెండు గంటల పాటు సీఎం జగన్ గడపనున్నారు. వాస్తవానికి ఓ ముఖ్యమంత్రి ఓ కార్యక్రమంలో అంత సేపు ఉండటమంటే మాటలు కాదు. శారదా పీఠానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని తద్వారా అర్థం చేసుకోవచ్చు. కాగా, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ శారద పీఠాన్ని సందర్శించుకొన్నారు. శారద పీఠాధిపతిని దర్శించుకొన్న తర్వాతే జగన్, మంత్రుల ప్రమాణానికి ముహుర్తాన్ని నిర్ణయం తీసుకొన్నారు. శారదా పీఠాధిపతి సూచించిన ముహుర్తం మేరకే జగన్ కేబినెట్ ను విస్తరించినట్టుగా అప్పట్లో ప్రచారం సాగింది.