ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కి ఆ రాష్ట్ర హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఫిబ్రవరి 27న విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై దాఖలు అయిన పిటీషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ పిటిషన్ దాఖలు చేసారు. ఈనెల 12న డీజీపీ గౌతమ్ సవాంగ్ కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించిందని మీడియాకు వివరించారు.
ఇక ఈ వ్యవహారం ఇప్పుడు అధికారులకు చుట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయంగా జగన్ కక్ష పూరితంగా వ్యవహరించడం అధికారులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్ అనవసరంగా దూకుడు ప్రదర్శించారని, ఆ రోజు చంద్రబాబు పర్యటన చేసుకుని వెళ్ళిపోయే వారని, ఇప్పుడు కోర్ట్ అధికారులకు జరిమానా విధించినా సరే ఆశ్చర్యం లేదని అంటున్నారు.
వాస్తవానికి చంద్రబాబుకి ముందే అధికారులు అనుమతి ఇచ్చారు. అయినా సరే ఆయనకు సిఆర్పీసి సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి యాత్రను అడ్డుకున్నారు. ఇది క్రమంగా వివాదాస్పదం అయింది. ఇక చంద్రబాబుపై అక్కడ టమాటాలు కోడి గుడ్లు విసరడంపై అధికార పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఇది పెద్ద దుమారం రేపింది. ఏది ఎలా ఉన్నా జగన్ దూకుడు అధికారుల మీడియాకు చుట్టుకోవడం ఖాయమని అంటున్నారు.