హలో.. నేను సీఎంను మాట్లాడుతున్నా… సామాన్యుడికి సీఎం కేసీఆర్ ఫోన్..!

-

తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ సామాన్య వ్యక్తికి ఫోన్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఓ సామాన్య వ్యక్తికి ఫోన్ చేయడం ఏంది. ఎందుకు చేశారు. దేని కోసం. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారు.. అంటే ఈ కథనం చదవాల్సిందే.

ముఖ్యమంత్రులు తమ పాలనను సచివాలయం నుంచి చేస్తారు. సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలవాలన్నా.. ఆయన అపాయింట్‌మెంట్ తీసుకోవాలన్నా చాలా కష్టమైన పని. కానీ.. తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం ముఖ్యమంత్రి సామాన్య ప్రజలకు కూడా చాలా సులభంగా అందుబాటులో ఉంటారని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది.

ఇప్పటికే ఆదిలాబాద్‌కు చెందిన రైతు శరత్‌కు ఫోన్ చేసి.. ఆయన భూమికి సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కరించిన సీఎం కేసీఆర్… తాజాగా.. మరో సామాన్య వ్యక్తికి ఫోన్ చేశారు. రోడ్డు విషయమై సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ మాజీ సర్పంచ్ వెంకటేశ్ గౌడ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు.

జగదేవపూర్, మర్కూక్ మండలాల ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లేందుకు దగ్గర దారి నిర్మించడం కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈనేపథ్యంలోనే క్షీరసాగర్ మాజీ సర్పంచ్‌కు ఫోన్ చేశారు. రాజీవ్ రహదారిలో ఉన్న ఒంటిమామిడి నుంచి మర్కూక్ మండలం పాండురంగ ఆశ్రమం వరకు రెండు లేన్ల రోడ్డును నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. అయితే.. ఆ రోడ్డు కోసం అవసరమైన భూమిని ఆయా గ్రామాల రైతులు ఇస్తారా? లేదా? అని తెలుసుకోవడం కోసం.. వెంకటేశ్ గౌడ్‌తో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు.

నిజానికి.. మర్కూక్, జగదేవపూర్ మండలాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ పోవాలంటే గౌరారం, ములుగు నుంచి రాజీవ్ రహదారికి వచ్చి.. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెళ్లడం చాలా దూరం. ఆ మండలాలకు, హైదరాబాద్‌కు దూరాన్ని తగ్గించడం కోసం.. ఒంటిమామిడి నుంచి క్షీరసాగర్, కమలాబాద్, నర్సంపల్లి, అలియాబాద్, అల్లీనగర్ మీదుగా పాండురంగ ఆశ్రమం వరకు రోడ్డు నిర్మించాలని అనుకుంటున్నట్టు సీఎం కేసీఆర్.. వెంకటేశ్‌కు తెలిపారు. ఆ ప్రాంతంలో రెండు లేన్ల రహదారి నిర్మిస్తే ఆ ప్రాంత ప్రజలకు అది ఎంతో ఉపయోగంగా ఉండటంతో పాటు హైదరాబాద్‌కు దూరం తగ్గుతుందని.. ఆ ప్రాంత రైతుల భూముల విలువలు కూడా పెరుగుతాయని సీఎం.. మాజీ సర్పంచ్‌తో చెప్పారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తామని.. రైతులు భూములు ఇచ్చేలా మాట్లాడాలని సీఎం కేసీఆర్.. మాజీ సర్పంచ్‌కు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news