కేటీఆర్ సియం స్లోగ‌న్ వెనుక ప్యూహం ఇదేనా

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. ముఖ్యమంత్రి అయ్యేందుకు సమయం ఆసన్నమైందా.. ఆయన సీఎం పీఠం ఎక్కడం ఖాయమైపోయిందా పలువురు మంత్రులు, టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల మాటలు వింటుంటే అలాగే అనిపిస్తోంది. కేసీఆర్ ఆ దిశగా ఆలోచన చేయాలని కొందరు కోరితే… తగు సమయంలో నిర్ణయం ఉంటుందని మరికొందరంటున్నారు. ఇక కేటీఆర్ సియం స్లోగ‌న్ వెనుక ప్యూహం ఏంటి ?

కేటీఆర్‌ను సీఎంను చేయాలనే డిమాండ్లు క్రమంగా ఊపందుకుంటున్నాయ్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..మంత్రులు పోటీలు పడీ మరీ దీనిపై మాట్లాడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు బహిరంగ వేదికలపై ప్రకటనలు గుప్పిస్తున్నారు. విపక్షాలు సైతం మరో అడుగు ముందుకేసి అసలు కేటీఆర్‌ను సీఎం చేసేందుకే.. కేసీఆర్ కాళేశ్వరం వెళ్లారని ఆరోపణలతో హీట్ పుట్టించారు విపక్ష పార్టీ నేతలు. 2018 ముందస్తు ఎన్నికల్లో టిఆర్ఎస్ రెండోసారి గెలిచినప్పటి నుంచీ ఈ వాదన వినిపిస్తుంది. అప్పట్లో వీటన్నింటికీ బ్రేక్‌ వేశారు కేసీఆర్‌. ఇప్పడు మళ్లీ, గులాబీ నేతలు.. కేటీఆర్‌ సీఎం కావాలనే వాదనను తెరమీదకు తెచ్చారు.

మంత్రులు కూడా ఒకరి తర్వాత ఒకరు కేటీఆర్ సీఎం కావాలన్న వాదనను సమర్థిస్థూ వస్తున్నారు. ఆ జాబితాలోకి తాజాగా ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు చేరారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేలు కూడా చోట కేటీఆర్ సీఎం కావాలని కాంక్షిస్తున్నారు. కేటీఆర్‌ పట్టాభిషేకంపై పార్టీ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరిగేలా వీరి కామెంట్లు ఉంటున్నాయి. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు ఓ అడుగు ముందుకేశారు. కాబోయే సియం రామ్ అంటూ బ‌హిరంగ వేదిక‌పైనే ప్రకటించారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రైన స‌భ‌లోనే ఈ స‌న్నివేశం జ‌రిగింది.

అయితే ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత వాటిని ఖండించలేదు..సమర్ధించలేదు గుంబనంగా ఉన్నారు కేటీఆర్. ఈట‌ల‌, త‌ల‌సాని ఇప్పటికే కేటీఆర్‌ను సీఎంను చేయాలంటూ కామెంట్లు చేశారు. మరో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, కేటీఆర్‌ను సీయం చేయాల‌న్నది ప్రజ‌ల డిమాండ్ అన్నారు. రోజుకొక జిల్లా నుంచి ప్యూహత్మకంగానే ఎమ్మెల్యేలు సీఎం కేటీఆర్ అన్న డిమాండ్ తెర పైకి తీసుకొస్తున్నారా అన్న చర్చ సైతం నడుస్తుంది. కేడర్ నుంచి జనం వరకు ఇదే అటెన్షన్ మరికొన్ని రోజులు ప్రచారంలో ఉంచి కాగల కార్యాన్ని మూడాల తర్వాత మంచి రోజులు వచ్చాక చేస్తారనేది..కేసీఆర్ క్లోజ్ సర్కిల్ నుంచి వినిప్పిస్తున్న మాట.

ఈ సందర్భంగా మరో చర్చ కూడా జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు.. యాదాద్రి ఆలయ పునర్‌ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. కాళేశ్వరం పూర్తయింది. ఆ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందుతున్నాయని అధికారపార్టీ సంతోషిస్తోంది. యాదాద్రి ప్రాజెక్టు కూడా దాదాపుగా పూర్తి కావస్తోంది. త్వరలో అక్కడ అవసరమైన యజ్ఞయాగాదులు నిర్వహించి.. ప్రారంభోత్సవాలు పూర్తి చేసి.. కేటీఆర్‌ పట్టాభిషేకంపై ప్రకటన చేస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఒక్కొక్కరుగా స్వరం పెంచుతున్నారని సమాచారం. అయితే ఏప్రిల్‌లో పార్టీ ప్లీనరీలో ఈ విషయాన్ని ప్రకటిస్తారా లేక అంతకంటే ముందే అన్నీ జరిగిపోతాయా అని గులాబీ శిబిరంలోని నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు.