రోజురోజుకీ కాంక్రీట్ జంగిల్ పెరిగిపోతోంది.రియల్ ఎస్టేట్ పుణ్యమా అని మైదానాలను కూడా లేఅవుట్‌లుగా మార్చి అమ్మేస్తున్నారు.విల్లాలు కడుతున్నారు. దీంతో పచ్చదనం తగ్గిపోయి వాతావరణంలో వేడి పెరిగిపోతోంది.అటు అభివృద్ధి పేరుతో చిన్న చిన్న అడవులను కూడా కరిగించేస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ వినియోగం కూడా పెరిగింది. దీంతో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుని వానలు కురవడమే గగనంగా మారింది.ఈ నేపథ్యంలో మొక్కలు నాటాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.ఇదే క్రమంలో కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు కూడా ఒకడుగు ముందుకేసీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంలా చేపట్టాయి. ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చాయి.
కేంద్రం సూచనల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లోఈ మేరకు ఆయన యోగీ ఆదిత్యనాథ్ సంవత్సరం పొడవునా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లక్నోలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఆగష్టు 15న ఐదు కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష్యాలు నిర్దేశించుకుని ఏడాది పొడవునా మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.ఏడాది పొడవునా 35 కోట్ల మొక్కలు నాటనున్నారు.అదే సమయంలో 2027 నాటికి అటవీ విస్తీర్ణాన్ని తొమ్మిది శాతం నుంచి 15 శాతానికి పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నాలుగేళ్లలో లక్ష్యం ప్రకారం 175 కోట్ల మొక్కలు నాటుతామని ఆయన పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో కనీసం వెయ్యి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లోనూ ప్లాంటేషన్ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. పచ్చదనం పెంపుదలకు అడవుల పెంపకంపై ప్రజా ఉద్యమం చేయాలని,అటవీ, వాతావరణ మార్పుల శాఖ నర్సరీల నుంచి మొక్కలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానం చుట్టూ మొక్కలు నాటాలని సూచించిన యోగీ ఈ పనిని ప్రాథమిక విద్యాశాఖ చేపట్టాలని ఆదేశించారు.జులై 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వాడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, పరిశుభ్రత, వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రోత్సహించాలన్నారు. ఇందుకోసం పాఠశాలల్లో పోటీలు నిర్వహించడంతో పాటు వ్యవసాయ-అటవీ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చన్నారు. ప్రైవేట్ రంగాలు, NGOలు, మతపరమైన మరియు సామాజిక సంస్థలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు.