వేరు వేరు ప్రభుత్వాలు… అయినా ఒకరిపై ఒకరు ప్రశంసల హోరు… ఏపీ, తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఇది. రెండు తెలుగు రాష్ర్టాల్లో పరస్పర వ్యతిరేక ప్రభుత్వాలు కొలువు దీరాయి. అయినప్పటికీ ఒకరికొకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ఏపీలో బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం నడుస్తున్నా కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం-జనసేన బంధం పరోక్షంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పరస్పర వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పాటై ఉన్నా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురుశిష్యులే. బహుశా అందుకే తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం సవాలు విసురుతున్నా.. ఏపీలో మాత్రం బీజేపీతో కలిసిన ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ నేతలు చంద్రబాబును ప్రశంసిస్తుంటే.. ఇక్కడి కూటమి ప్రభుత్వ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలుగు రాష్ర్టాల నేతలు ఒకరిపై ఒకరు ప్రసంశలు కురిపించడానికి కారణం వరద సహాయక చర్యలు. విజయవాడలో వరదల నేపధ్యంలో సహాయక చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి పొగడ్తలతో ముంచేశారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన షర్మిల.. బాధితులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయంపై ప్రశంసలు కురింపించారు. చంద్రబాబు సమర్ధవంతంగా వరద సహాయక చర్యలు చేపడుతున్నారని అన్నారు.
రాజకీయంగా పార్టీకి ఇబ్బంది కల్గించే పరిణామం కావడంతో షర్మిల తీరు కాంగ్రెస్ పార్టీ నేతలకు నచ్చడం లేదు. వరదలపై ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపధ్యంలో షర్మిల ప్రశంసలు కురిపించడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోందని చర్చలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ చర్యలపై ఇతర రాజకీయ పార్టీలు ప్రశంసలు కురిపించడం శుభ పరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసలతో అభినందించారు.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల…చంద్రబాబును ప్రశంసిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెచ్చుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్..తెలంగాణలో ఆక్రమణలు కూలుస్తున్న హైడ్రా గురించి కూడా ప్రస్తావించారు.
హైడ్రా విధానంపై సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను పరిరక్షించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా తీసుకురావడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చెరువుల్ని కాపాడే విషయంలో రేవంత్ రెడ్డి మంచి పని చేశారని చెప్తూ అక్రమ నిర్మాణాలు లేకపోతే ఇలాంటి విపత్తులు రావన్నారు. అక్రమార్కులపై హైడ్రా వంటివి కచ్చితంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. ఏది ఏమైనా ఏపీ, తెలంగాణలో ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.భవిష్యత్తులో జరగనున్న రాజకీయ మార్పులకు ఈ తాజా పరిణామాలు వేదిక కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.