ఆ వ్యాఖ్యాలే రేవంత్‌ కొంప ముంచాయా.?

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడి నియామకం రోజుకొక మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్‌ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిల ఇద్దరిలో ఎవరిలో ఒకరినైనా ఆ పదవి దక్కుతుందని చర్చ జరుగుతుండగా ఉన్నట్టుండి కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి. పార్టీ సీనియర్‌ నాయకులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, టి.జీవన్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డిల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో జరగనున్న ఎన్నికలు లాంటి అంశాల నేపథ్యంలో టీపీసీసీ పదివి ఎవరికిస్తే బాగుంటుందో అని అధిష్టానానికి తలనొప్పిగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో టీపీసీసీ పదవిపై అంత పెద్దగా చర్చలేమీ జరగలేదు.

 

ముందే పసిగట్టారా..?

అయితే ఇటీవల టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. తానే టీపీసీసీ అధ్యక్షుడిననే దీమాతో ఉన్న రేవంత్‌ తనకు అధ్యక్ష పదవే ముఖ్యం కాదని, ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చినా ఇబ్బంది లేదంటూ చేసిన వ్యాఖ్యలతో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జీవన్‌రెడ్డి అధ్యక్షుడు, రేవంత్‌ ప్రచార కమిటీ చైర్మన్‌గా అధికారిక ప్రకటన వెలువడుతుందనే ప్రచారం జరిగింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చినా ఫర్వాలేదని రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ వర్గాలు పలు రకాలుగా పర్కొంటున్నారు. ఆ పదవి ఎవరికిచ్చినా సమన్వయంతో పనిచేస్తాని సూచికలు చేసినట్లు ఓ వైపు చర్చ జరుగుతుండగా అధిష్టానం నుంచి అలాంటి సంకేతాలు ఉంటాయని ముందే రేవంత్‌ రెడ్డి ఇలా అంటున్నారని మరి కొందరు చర్చించుకుంటున్నారు.