దేశ వ్యాప్తంగా గత ఐదు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే నిత్యవసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్పణానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. వినూత్న పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగా.. ఈ నెల 31న ఉదయం 11 గంటలకు ప్రజలు అందరూ బయటకు, ఇంటి ముందు, బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి డప్పు, గంటలను మోగించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. అలాగే గ్యాస్ సిలిండర్లు ప్రదర్శించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా పిలుపునిచ్చారు. కాగ గత ఎనిమిదేళ్ల నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ.. రూ. లక్షల కోట్లను మోడీ దోచుకున్నారని ఆరోపించారు.
గత రెండు సంవత్సరాల్లోనే కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై రూ. 29, డీజిల్ పై రూ. 28.58 పెంచిందని మండిపడ్డారు. గత ఎనిమిదేళ్లల్లో మోడీ సర్కార్ డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని 531 శాతం, పెట్రోల్ పై 203 శాతం పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.