కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత భిశ్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ లలో అసోం సీఎంపై ఫిర్యాదులు చేసింది. అయితే రాష్ట్ర పోలీసులు అసోం సీఎం పై కేసులు నమోదు చేయలేదు. దీనికి నిరసనగా, అసోం సీఎం అనుచిత వ్యాఖ్యలకు నిరసన గా నేడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపును ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీ కార్యాలయాల ముందు, పోలీస్ కమిషనరేట్ల ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకుంది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద జరగబోయే ధర్నాలో పాల్గొంటారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ వద్ద జరిగే ధర్నా కార్యాక్రమంలో ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి పాల్గొంటారు. కాగ రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అసోం సీఎం పై ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర పోలీసులు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.