పాడి రైతులకు గుడ్ న్యూస్. పాల సేకరణ ధరలు పెరగనున్నాయి. విజయ డెయిరీ పాల సేకరణ ధరలను పెంచుతూ.. నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం ముందర ఉంది. ఇప్పుడు ఉన్న పాలసేకరణ ధరలకు అదనంగా లీటర్ కు మరో రూ. 4 పెంచాలని ప్రభుత్వాన్ని విజయ డెయిరీ చైర్మన్ భూమారెడ్డి కోరారు. అయితే ప్రభుత్వం లీటర్ పై రూ. 2 పెంచాలని భావిస్తోంది. ఈరోజు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం పెరిగిన ధరలు, ఖర్చులకు అనుగుణంగా పాల సేకరణ ధరను పెంచాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బర్రె పాలు లీటర్ కు రూ. 40- రూ. 45, ఆవు పాలకు రూ. 28 వరకు చెల్లిస్తున్నారు. అయితే బర్రె పాలకు రూ. 55, ఆవు పాలకు రూ. 35 చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పాలసేకరణ ధరలు పెరిగితే కొంతలో కొంత రైతులకు లాభం చేకూరే అవకాశం ఉంది.