ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డికి హ్యాండిచ్చారా ?

-

తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులు అయితే ఒక్క సారిగా స్పీడు పెంచుతారు లేకపోతే సైలెంట్ అయిపోతారు. ఒక పక్క నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ చావోరేవో అన్నట్టు పోరాటం చేస్తుంటే.. పార్టీకి చెందిన కీలక ఎమ్మెల్యే మాత్రం ఏమి పట్టనట్లు అదృశ్యమయ్యారు. నిత్యం ఏదో ఒక అంశం మీద హడావిడి చేసే సంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సాగర్ ఎన్నికల సమయంలో సడన్ గా సైలెంట్ అయ్యారు. జానారెడ్డి ప్రచారంలో అంతా తానై వ్యవహరిస్తాడనుకుంటే ఎక్కడున్నాడో అంతుపట్టకుండా కీలక సమయంలో హ్యండిచ్చాడు.


గడిచిన నెల రోజులుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా లేనట్లు తెలుస్తుంది. గాంధీభవన్‌కు వచ్చి చాలా రోజులు అయ్యిందంటున్నాయి పార్టీ వర్గాలు. తన నియోజకవర్గం సంగారెడ్డిని దాటి బయటకు రావడం లేదట. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలంతా పార్టీ మారినా ఆరుగురు మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఈ ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కలిసి వచ్చింది లేదు. జగ్గారెడ్డి ఒక్కరోజు మినహా మిగతా రోజులు డుమ్మా కొట్టేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జగ్గారెడ్డి అసెంబ్లీకి వచ్చిన ఆ ఒక్కరోజు కూడా సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ కోసం ఆందోళన చేశారు. అదే రోజు సభలో మెడికల్‌ కాలేజీకి నిధులు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పాక మళ్లీ కామైపోయారు జగ్గారెడ్డి. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ హోరాహోరిగా తలపడుతుంది. మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు జానారెడ్డి బరిలో ఉన్నారు. పార్టీ ప్రతిష్టగా తీసుకుని ఎన్నికల గోదాలోకి దిగింది. సాగర్‌లోని మాడుగులపల్లి మండలం బాధ్యతలను ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అప్పగించింది పీసీసీ. ఆయన మాత్రం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కి సన్నిహితంగా ఉండే జగ్గారెడ్డి పీసీసీ చెప్పినా సాగర్‌కు వెళ్లకపోవడం.. ఎప్పుడు వెళ్లి ప్రచారం చేస్తారో తెలియకపోవడంతో ఆయన గురించి బయట రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇంచార్జీ భాద్యతలిచ్చిన మాడుగులపల్లి మండలం ముఖం చూడలేదట. ఒకవైపు పోలింగ్‌ తేదీ సమీపిస్తున్నా స్పందన లేదని చెబుతున్నారు. మరి కాంగ్రెస్ నేతలకు జగ్గారెడ్డికి ఏ విషయంలో చెడిందో కానీ బయట ఎలాంటి ప్రచారం జరుగుతున్నా జగ్గారెడ్డి స్పందించడం లేదు. ఆఖరి వారంరోజులన్న సాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారో లేక జానారెడ్డికి జగ్గారెడ్డి హ్యాండిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news