ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుకు కరోనా ఎఫెక్ట్ బాగానే తగిలిందని అంటున్నారు పరిశీలకులు. ప్రపంచాన్ని ఒణికిస్తున్న కరోనా ఎఫెక్ట్‌తో రామోజీ సంస్థల ఆదాయం రెండు రోజుల్లోనే దాదాపు రూ.100 కోట్లకు పైగానే నష్టం చవిచూసినట్టు చెబుతున్నారు. దీనిలో ప్రధానంగా రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన నష్టమే రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫిల్మ్ సిటీలో నిత్యం పదుల సంఖ్యలో వివిధ భాషా చలన చిత్రాలు, టీవీ సీరియళ్ల నిర్మాణం సాగుతుంటుంది.
అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా కొన్ని సినిమాలు ఇక్కడే రూపు దిద్దుకుంటున్నాయి. ఇక, ఫిల్మ్ సిటీ పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందింది. రోజుకు దాదాపు మూడు నుంచినాలుగు వేల మంది పర్యాటకులు వివిధ రాష్ట్రాల నుంచిదేశాల నుంచి వస్తుంటారు. దీంతో నిత్యం రూ. 60 నుంచి 70 కోట్ల మేరకు ఆదాయం ఫిల్మ్ సిటీకి వస్తోంది. అయితే, ఇప్పుడుప్రపంచాన్ని ఒణికిస్తున్న కరోనా ఎఫెక్ట్ కారణంగా పర్యాటకులు పూర్తిగా తగ్గిపోయారు. అదేసమయంలో విదేశీ పర్యాటకులు అయితే..అసలు రావడమే మానేశారు.
నిజానికి ఫిలింసిటీపై కరోనా ఎఫెక్ట్ గడిచిన రెండు నెలలనుంచి కూడా ప్రభావం చూపిస్తోంది. అయితే, ఏదో ఒక విధంగా నెట్టుకొస్తున్నా.. రెండు మూడు రోజులుగా దేశంలోనూ కరోనా కేసులు నమోదు కావడం, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎఫెక్ట్ తీవ్రంగా ఉండడం, ఇప్పటికే దేశంలో ఇద్దరు మరణించడం వంటి ప్రభావం ఫిలింసిటీపై పడిందని చెబుతున్నారు. ఈ పరిణామాలతో సినిమా షూటింగులు నిలిచిపోయా యి. అదేసమయంలో పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో కేవలం రెండే రెండు రోజుల్లో రామోజీరావు సంస్థలు వంద కోట్ల మేరకు నష్టాలు చవిచూశాయని సమాచారం.