పిలిచి కుర్చి ఇస్తే ఇమేజ్ డ్యామేజ్ చేశారా

-

తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నడు లేని విధంగా ఈ మధ్య వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. ఒక సమస్య పోయిందిలే అనుకునే లోగా కొత్త సమస్య తయారవుతుంది. అయితే ఇవన్నికూడా స్వయం కృతమే అని వీటన్నిటికి ఒక కీలక అధికారే కారణమన్న చర్చ జరుగుతుంది. సీనియర్లను సైతం పక్కన పెట్టి ఆయనకు అత్యున్నత స్థానం ఇస్తే ఇమేజ్ డ్యామేజ్ చేశారట..ఇదే అంశం తెలంగాణ ఐఏఎస్ వర్గాల్లో సైతం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాలు ఈ మధ్య తీవ్రంగా వివాదస్పదమైయ్యాయి. ధరణి సమస్యలు,LRS తో కేసీఆర్ సర్కార్ సామన్యుల్లో సైతం అభాసుపాలైంది. ఇక గ్రేటర్ లో వరద సాయం విషయంలో ఇమేజ్ డ్యామేజ్ అయింది. అయితే వీటన్నిటికి కారణం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అని ప్రభుత్వ వర్గాల్లో ఇదివరకే చర్చ జరిగింది. ఇక గత నెలలోనే సిఎస్ ను మార్చుతారని ప్రచారం మొదలైంది.

సోమేశ్‌ తప్పుడు సూచనలు ఇచ్చారని ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఉన్నారని అధికారులు..అధికారపార్టీ వర్గాల్లోనూ గత నెలలోనే దీనిపై తీవ్ర చర్చ నడిచింది. గత నెలలోనే దీనిపై ఒక నిర్ణయం జరిగిపోతుందని అనుకున్నారట. కానీ సీఎస్ మార్పు అన్నది ప్రచారానికే పరిమితమైంది. దీనిపై పెద్దగా కదలిక కూడా లేదు. కానీ.. ఈ విషయం తెలుసుకున్న సీనియర్‌ ఐఏఎస్ లు అలర్ట్‌ అయ్యారట. రాష్ట్ర కేడర్‌కు చెందిన కొందరు ఐఏఎస్ లు డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారు సైతం సీఎస్ పోస్టు పై కన్నేశారట.

 

కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్ జంట వసుధా మిశ్రా.. రాజీవ్‌ రంజన్‌ మిశ్రాలు ఇప్పటికే కర్చీఫ్‌ వేసినట్టు అధికార వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేస్తే తిరిగి రాష్ట్రానికి వస్తామని ప్రభుత్వ పెద్దలకు చెప్పారట. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే ఒక ముఖ్యనేత వారికి సపోర్ట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్లను కాదని కోరి కుర్చి ఇస్తే ఇప్పటికే సోమేష్ నిండా ముంచారని ఇక కొత్త వారు ఏం వెలగబెడతారో అన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news