ఉప ఎన్నిక సైతం సార్వత్రిక ఎన్నికల సమరాన్ని తలపించేలా సాగిన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక పోలింగ్ పూర్తయిం ది. వాస్తవానికి పోలింగ్ సమయంలో అలజడులు జరగడం ఖాయమని.. దాడులు.. రిగ్గింగులకు కూడా అవకాశం ఉంటుందని అందరూ అనుకున్నా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక, ఇప్పుడు పూర్తయిన పోలింగ్ సరళిని గమనిస్తే.. ఎవరు గెలుపు గుర్రం ఎక్కుతారు? అనే ప్రశ్న సశేషంగా మిగిలిపోవడమే కాదు.. తీవ్ర ఉత్కంఠగా కూడా మారిపోయింది. 2018 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగా రెడ్డి గెలుపు గుర్రంఎక్కారు. అయితే, అనారోగ్య కారణంగా ఆయన మృతి చెందడంతో ఇక్కడ ఉప పోరును నిర్వహించారు.
అధికార పార్టీ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టీఆర్ ఎస్ టికెట్ ఇచ్చింది. వాస్తవానికి ఇలాంటి ఉప ఎన్నికల విషయంలో ఇతర పార్టీలు దూరంగా ఉండేవి. అయితే, ఈ సంప్రదాయాన్ని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఏనాడో తుడిచిపెట్టేశారు. ఖమ్మం జిల్లా పాలేరు కు గతంలో ఉప పోరు వచ్చినప్పుడు అక్కడ పోటి చేసి గెలిచి.. తర్వాత మరణించిన కాంగ్రెస్ అభ్యర్థి స్థానంలో ఉప పోరు వచ్చింది. ఈ క్రమంలో టీఆర్ ఎస్ కనీసం సింపతీ కూడా చూపించకుండా.. ఇక్కడ నుంచి పోటీకి అభ్యర్థిని నిలబెట్టింది. ఇక, అప్పటి నుంచి ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలూ పోరాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ టీఆర్ ఎస్ యువ నాయకుడు రఘునందనరావు పోటీ కి దిగారు.
కాంగ్రెస్‌కూడా ఇక్కడ పోటీకి దిగినా.. ప్రధాన పోరు మాత్రం టీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోవడం.. తీవ్ర ఉద్రిక్తతలు, ఇరు పార్టీ నేతల మధ్యతీవ్ర విమర్శలు.. దూకుడు రాజకీయం.. ఏకంగా ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి ఇక్కడే తిష్టవేసి.. ఎన్నికల క్రతువను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం సంచలనంగా మారింది. ఇక, ఇప్పుడు పోలింగ్ ముగిసినా.. 75 శాతానికి మించి పోలింగ్ నమోదు కావడంతో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతతోనే ఇంత రేంజ్‌లో పోలింగ్ జరిగిందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అదేసమయంలో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని.. కరోనా సమయంలో ఇంటింటికీ బియ్యం, పప్పులు నెలకు రెండు సార్లు చొప్పున పంచడం తమకు అనుకూలంగా మారిందని.. టీఆర్ ఎస్ విధానాలతో ప్రజలు విసిగిపోయారని.. బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.
ఇక, టీఆర్ ఎస్ ఐకాన్.. కేసీఆర్ కే ప్రజలు ఇక్కడ మొగ్గుచూపుతున్నారని అధికార పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇలా మొత్తంగా ఈ రెండు పార్టీలు ఎవరి అంచనాల్లో వారు ఉండగా.. తాజాగా పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయి. థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ విజయభేరీ మోగిస్తుందని అంచనా వేసింది. 51-54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు తొలిస్థానం లభించగా.. 33-36 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు రెండోస్థానం దక్కుతుందని అంచనా వేసింది. పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మాత్రం బీజేపీ విజయం సాధించబోతున్నట్లు స్పష్టం చేసింది. 47 శాతం ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం రానున్నట్లు పేర్కొంది. తర్వాత 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్‌కు రెండోస్థానం కట్టబెట్టడం గమనార్హం. ఏదేమైనా.. దుబ్బాక దంగల్.. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి.