మునుగోడు కాంగ్రెస్ లో రచ్చ…నిలబడేది ఎవరు?

-

కంచుకోట లాంటి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి మరీ దిగజారుతూ వస్తుంది…ఇప్పటికే బలమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడటం పెద్ద మైనస్ అయిపోయింది. అక్కడ కోమటిరెడ్డి తర్వాత…అంతటి స్థాయిలో బలమైన నేత కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. అయితే కోమటిరెడ్డి పార్టీని వీడిన సరే మునుగోడులో కాంగ్రెస్ ని నిలబెట్టాలని రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ సభ పెట్టి…కాంగ్రెస్ శ్రేణులని కోమటిరెడ్డితో పాటు వెళ్లకుండా కాస్త బ్రేక్ వేశారు.

అలాగే మునుగోడులో కాంగ్రెస్ బలం తగ్గలేదని నిరూపించారు. అయితే కార్యకర్తల పరంగా ఇబ్బంది లేదు…కానీ నేతల వల్లే పెద్ద ఇబ్బంది ఉంది..ఇక్కడ అప్పుడే గ్రూపు రాజకీయాలు మొదలైపోయాయి…సీటు తమకంటే తమకే అని నేతలు ప్రకటించుకునే పరిస్తితి. ఇప్పటికే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారసురాలు స్రవంతి టికెట్ రేసులో ఉన్న విషయం తెలిసిందే. పైగా ఇటీవల జరిగిన సభ విజయవంతం కావడానికి  తానే కారణమని, టికెట్ తనకే అని స్రవంతి ఫోన్ లో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

అటు సీనియర్ నేత, ప్రముఖ రియల్టర్ చల్లమల్ల కృష్ణా రెడ్డి సైతం టికెట్ తనదే అని ప్రకటించుకుంటున్నారు. ఆర్ధికంగా బలంగా ఉండటంతో కోమటిరెడ్డిని ఢీకొనే సత్తా కృష్ణారెడ్డికి ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదే సమయంలో ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరిన చెరుకు సుధాకర్ సైతం టికెట్ రేసులో ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన సుధాకర్ కు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పైగా నియోజకవర్గంలో బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి.

ఇలా మునుగోడు కాంగ్రెస్ టికెట్ విషయంలో ట్రైయాంగిల్ ఫైట్ నడుస్తోంది..అయితే ఈ విషయంపై త్వరగా క్లారిటీ ఇవ్వాలని పి‌సి‌సి భావిస్తుంది. అయితే ఇప్పటికే కృష్ణారెడ్డి పేరును ఖరారు చేయాలని అనుకున్నా మిగిలిన ఆశావహులు పార్టీ ఫిరాయించే అవకాశం ఉందన్న సమాచారంతో పీసీసీ నేతలు వేచి చూస్తున్నారు. ఒకేసారి అభ్యర్థి పేరు ప్రకటించకుండా సమావేశాలు, మండలాల్లో అభిప్రాయ సేకరణ పేరుతో కొంత ప్రశాంత వాతావరణం వచ్చేలా చేసుకుని..ఈ నెలాఖరుకు కృష్ణారెడ్డి పేరుని ప్రకటించవచ్చని తెలుస్తోంది. చూడాలి మరి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎవరు నిలబడతారో?

Read more RELATED
Recommended to you

Latest news