ఎన్నికల ప్రవర్తనా నియమావళి – చేయకూడని పనులు.. ఇవి చేస్తే అంతే

-

తెలంగాణ ఎన్నికల షెడ్యుల్‌ విడుదలవడంతో ఎలక్షన్‌ కోడ్‌ అమలులోకి వచ్చింది. ఎన్నికలు ప్రశాంతంగా, నిజాయితీగా, స్వేచ్చగా జరగడానికి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అన్ని రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు, మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల మరియు, స్థానిక సంస్థల ఎన్నికలతో సంబంధం వున్న ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది.

ఎన్నికల్లో గెలవడం అనేది ప్రతి ఒక్క అభ్యర్థి కల. ప్రతి పార్టీ కల. కానీ.. ఆ కలను చిన్న చిన్న తొందర పాట్లతో కలలాగానే మార్చుకోకండి. నిబంధనలను పాటించండి. ఈ నిబంధనల గురించి అందరికీ తెలియజేయండి. చాలా మంది పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు కూడా ఈ నిబంధనలను తెలియకపోవచ్చు. ఈ నిబంధనలను అభ్యర్థులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు తెలియజేయండి. ఈ పోస్ట్‌ను సోష‌ల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయండి. అందరికీ తెలియజేయండి.

ప్రవర్తనా నియమావళి:

  1. ఏ పార్టీ లేదా అభ్యర్థి గాని: ప్రస్తుతం నెలకొన్న విబేధాలను తీవ్రతరం చేయడము, పరస్పరం ద్వేష భావాన్ని సృష్టించడము, వివిధ కులాలు, మతాల మధ్య లేదా భాషల మధ్య విభేదాలను సృష్టించే కార్యకలాపాలలో పాల్గొనరాదు.
  2. జాతి, మతము, కులము, ప్రాంతము ప్రాతిపదికగా ఓటు వేయమని కోరరాదు.
  3. ఎన్నికల ప్రచారానికి ప్రార్ధన మందిరాలైన దేవాలయము, మసీదు, చర్చి లాంటి ప్రదేశాలను వేదికలుగా వాడుకొనరాదు.
  4. వాస్తవాలు తెలుసుకోకుండా ఎలాంటి నిరాధార ఆరోపణలు చేయరాదు.
  5. పోటీ చేయు అభ్యర్థుల వ్యక్తిగత నివాసాల వద్ద, వారి అభిప్రాయాలకు లేదా కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు లేదా పికెటింగులు ఎట్టి పరిస్థితులలో నిర్వహించరాదు.
  6. ఏదేని రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి, ఇతర రాజకీయ పార్టీల లేదా వారి నాయకుల దిష్టి బొమ్మలను ఊరేగించడము, తగులబెట్టడం మరియు ఇతర రూపాలలో ప్రదర్శించడం చేయరాదు.
  7. మరొక రాజకీయ పార్టీ లేదా అభ్యర్థిచే ఏర్పాటు చేయబడిన ఎన్నికల సమావేశాన్ని అడ్డుకొనుట లేదా చెడగొట్టుట.
  8. ఒక ప్రైవేటు/ ప్రభుత్వ భవనాన్ని, ఆ భవన యజమాని/ సంబంధిత అధికారి నుండి వ్రాత మూలకంగా ముందస్తు అనుమతి పొందకుండా, ఆ భవనము పై ఏ పార్టీగాని, అభ్యర్థి గాని, వారి అనుచరులు గాని పార్టీల్లో అభ్యర్థి జండాను పాతుటకు, నోటీసు, పోస్టర్లు అతికించుట, స్లోగన్లు వ్రాయుట చేయరాదు. ఒకవేళ ఈ విషయంలో తగు అనుమతి పొందినట్లయితే అట్టి వ్రాతపూర్వకమైన అనుమతి పత్రం యొక్క కాపీని వెంటనే సంబంధిత ఎన్నికల అధికారికి పంపాలి.
  9. ఒక అభ్యర్థి లేదా రాజకీయ పార్టీ వారి అనుచరులు ఎగురవేసిన జెండాను లేదా అంటించిన పోస్టర్లను ఏ ఇతర అభ్యర్థి లేదా అతని అనుచరులు తొలగించరాదు లేదా పాడు చేయరాదు.
  10. ముద్రించే వారి మరియు ప్రచురణ కర్త పేరు, చిరునామా పేర్కొనకుండా ఏదేని పోస్టరు, కరపత్రం, లీఫ్ లెట్, సర్క్యులర్, లేదా ప్రకటనను ముద్రించుట లేదా ప్రచురించుట.
  11. అధీకృత స్థానిక అధికారుల నుండి తగిన అనుమతి పొందకుండా ఏ పార్టీ గానీ అభ్యర్థి గానీ బహిరంగ సమావేశాలు లేదా ఊరేగింపులు నిర్వహించరాదు.
  12. అధీకృత స్థానిక అధికారి నుండి తగిన అనుమతి పొందకుండా ఏ పార్టీ గానీ, అభ్యర్థి గానీ లౌడుస్పీకర్లు ఉపయోగించరాదు. సంగీతాన్ని లేదా పాటలను వినిపించడానికి లౌడుస్పీకర్లను ఉపయోగించరాదు.
  13. ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 10.00 గంటల మధ్య మాత్రమే లౌడ్ స్పీకర్లు ఉపయోగించాలి.
  14. ఎన్నికల ప్రచారం మూలంగా ఆసుపత్రులలోని రోగులకు అసౌకర్యం కలుగకుండా నివారించడానికి ఆసుపత్రుల పరిసరాలలో ఏ విధమైన శబ్దకాలుష్యం కలుగకుండా ఉండేలా అన్ని రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  15. బహిరంగ ప్రదేశాలలో ఎన్ని కల సమావేశాలను నిర్వహించడానికి అనుమతి మంజూరు చేసే విషయంలో అభ్యర్థుల లేదా రాజకీయ పార్టీల మధ్య ఏ విధమైన పక్షపాతాన్ని చూపరాదు.
  16. ఒకే ప్రదేశంలో ఒకే తేదీ, ఒకే సమయంలో సమావేశాలను నిర్వహించడానికి ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్ధులు లేదా రాజకీయ పార్టీల నుండి అభ్యర్థనలు వచ్చిన సందర్బంలో మొట్టమొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి లేదా పార్టీకి అనుమతిని మంజూరు చేయాలి.
  17. పోలింగు ముగియటానికి నిర్ణయించిన సమయానికి 48 గంటల ముందు సభలు నిర్వహించరాదు.
  18. ఓటర్లకు ఏ రూపంలోనైనా లంచము లేదా రివార్డులు ఇవ్వజూపడం.
  19. పోలింగు స్టేషనుకు లేదా పోలింగు స్టేషను నుండి ఓటర్లకు ఏదయినా ప్రయాణ సౌకర్యం లేదా ప్రయాణ ఏర్పాట్లను చేయడం. పోలింగు స్టేషను లోపల లేదా దాని దరిదాపులలో క్రమశిక్షణా రహితంగా ప్రవర్తించడం లేదా పోలింగు అధికారి తన డ్యూటీని నిర్వర్తించడంలో అడ్డగించడం.
  20. పోలింగు స్టేషనుకు 100 మీటర్ల పరిధిలోపల ఓట్లకోసం ప్రచారం చేయుట లేదా విజ్ఞప్తి చేయుట.
  21. వేరొక ఓటరు పేరు మీద ఓటు వేయడానికి ప్రయత్నించడం.
  22. ఓటు వేసే వ్యక్తులు తప్ప రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే అనుమతి పత్రం లేకుండా పోలింగు కేంద్రాలలోకి ఏ వ్యక్తి కూడా ప్రవేశించరాదు.
  23. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్ని కల పరిశీలకులను నియమిస్తుంది. ఎన్నికల నిర్వహణ తీరుకు సంబంధించి నిర్దిష్టమైన ఏవైన పిర్యాదులు లేదా సమస్యలు అభ్యర్థులకు లేదా వారి ఏజెంట్లకు ఉత్పన్నమయినచో ఆ సమస్యలను వారు ఎన్ని కల పరిశీలకుల దృష్టికి తీసుకు రావచ్చును.
  24. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన ద్వారా నిర్ణయించిన ఖర్చుకు మించి పోటీ చేసే అభ్యర్థి ఎన్ని కలలో ఖర్చు చేయరాదు. పోటీ చేసే అభ్యర్థి, నిర్దిష్ట నమూనాలో రోజువారీ ఎన్నికల వ్యయాన్ని తెలిపే రికార్డును నిర్వహించాలి. అతని అభ్యర్థిత్వాన్ని అంగీకరించిన తేదీన, అతనికి అట్టి నమూనాలను రిటర్నింగు అధికారి ఉచితంగా సరఫరా చేస్తారు.
  25. ఎన్ని కల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల లోపల పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తన మొత్తం ఎన్నికల ఖర్చు వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారికి తప్పక సమర్పించాలి.
  26. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని కల సమయంలో పూర్తిగా నిష్పక్షపాతంగా వుండాలి. పోటీ చేస్తున్న అభ్యర్థి లేదా రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎత్తి పరిస్థితిలోను ప్రచారం చేయరాదు.
  27. ఎన్నికల పర్యటనలో భాగంగా ఒక మంత్రి, ఏదేని వ్యక్తి ఆహ్వానాన్ని అంగీకరించి, ఆ వ్యక్తి ఇంటిలో ఏర్పాటు చేసిన ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే, ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ అట్టి కార్యక్రమంలో పాల్గొనరాదు.
  28. ప్రభుత్వ నిధులు, లేదా వాహనాలను వినియోగించరాదు.
  29. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, సహకార సంస్థలు మరియు ప్రభుత్వ గ్రాంట్లను పొందుతున్న ఏదేని ఇతర సంస్థలకు చెందిన వాహనాలను ఎన్నికల ప్రకటన తేది నుండి ఎన్నికల ఫలితాల ప్రకటన తేది వరకు ఏ రీతిలోనూ ఎన్నికల ప్రచారం కోసం ఎవరైనా మంత్రికి, పార్లమెంటు సభ్యునికి, లేదా శాసన సభ్యునికి లేదా అభ్యర్థికి సమకూర్చరాదు.
  30. ఈ నిబంధనలను ఉల్లంఘించినచో వివిధ చట్టాల క్రింది శిక్షించబడుదురు. జిల్లా ఎన్ని కల అధికారి, డిప్యూటీ జిల్లా ఎన్ని కల అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అధికారి మరియు పోలీసు అధికారులు ఈ నియమావళిని ఉల్లంఘించిన వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియ పరుస్తూ సంబంధిత క్రిమినలు కోర్టులలో ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి అధికారం కలిగి ఇఇఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version