తెలంగాణ ప్రభుత్వం కులగణన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది.. అట్టడుగు వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో త్వరితగతిన దాన్ని పూర్తి చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ప్రక్రియలో వేగం పెంచారు.. ఇదే సమయంలో వారికి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందట.. వివరాలు చెప్పేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని జనాలు మొఖం చాటేస్తూ ఉండటం పెద్ద సమస్యగా మారిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సర్వేలపై తెలంగాణ ప్రజల్లొ అనేక అనుమానాలు ఉన్నాయి.. సర్వే కోసం రూపొందించిన ప్రశ్నావళిలో పలు అభ్యంతరాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారట.. వ్యక్తిగత సమాచారాన్ని కూడా అధికారులు సేకరిస్తున్నారని పలు ప్రాంతాల్లో నిరసనలు చేస్తుండటంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు అతికష్టం మీద సర్వే చెయ్యాల్సి వస్తోందన్న ప్రచారం జరుగుతోంది..
ప్రజల నుంచి వివరాలు సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం 56 ప్రశ్నలను తయారుచేసింది.. సబ్ టైటిల్ గా ఉన్న ప్రశ్నలతో లెక్కిస్తే మొత్తం 70కి పైగా ప్రశ్నలు ఉన్నాయి.. వాటన్నింటిని ప్రజల వద్ద అడిగితే.. వారు సరిగా సమాధానం చెప్పడం లేదనే అభిప్రాయం సర్వేకు వెళ్లిన అధికారులు చెబుతున్నారు.. అయితే ఈ సర్వేపై జనాలు మరోలా స్పందిస్తున్నారు.. శాలరీ, స్థిరాస్తులు వంటి వాటిని ప్రశ్నలుగా అడుగుతున్నారని.. ప్రజలు మండిపడుతున్నారు.. వ్యక్తిగత రహస్యాలను కూడా అడిగితే ఎలా చెప్పాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు.. దీంతో సర్వేకి వెళ్లిన అధికారులు తలలు పట్టుకుంటున్నారు..
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వృద్దులు, నిరక్ష్యరాసులు ఈ సర్వే తమకొద్దంటున్నారట.. ఆస్తులు, పొలాలు వంటి వాటి వివరాలు చెప్పేస్తే.. వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులకు అనర్హత విధిస్తారేమోనన్న ఆందోళనలో వారున్నారని తెలుస్తోంది.. దీంతో అటు అధికారులకు, ఇటు ప్రభుత్వానికి ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారిందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది..