హుజూరాబాద్ ఉపపోరు: రేవంత్ రెడ్డి ఎంట్రీతో మారిన సమీకరణాలు…!

-

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కి ఇవ్వడంతో హుజూరాబాద్‌లో రాజకీయ సమీకరణాలు మారతాయా? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తే కాస్త అవుననే సమాధానం వస్తుంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అంతకముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగడం ఖాయమైంది. ఈ ఉపపోరులో ఈటల వర్సెస్ టీఆర్ఎస్ మాదిరిగానే ఫైట్ జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

దుబ్బాక మాదిరిగానే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అవుతుందని విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ ఎంపిక కావడంతో హుజూరాబాద్ ఉప ఎన్నికపై దాని ప్రభావం పడేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రేవంత్ దూకుడు రాజకీయాలు అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు పీసీసీ అయ్యాక తన సొంత వ్యూహాలతో ముందుకెళ్లడం ఖాయం.

అలాగే హుజూరాబాద్‌లో రెడ్డి వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి బరిలో ఉన్నారు. దీంతో రేవంత్ హుజూరాబాద్ ఎంట్రీ ఇస్తే పరిస్తితి మారి కాంగ్రెస్ కూడా రేసులోకి వస్తుందని అంటున్నారు. అయితే టీఆర్ఎస్ ఇంతవరకు అభ్యర్ధిని డిసైడ్ చేయలేదు. టీఆర్ఎస్ సైతం రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని నిలబడితే సమీకరణాలు మారతాయి.

కానీ రేవంత్‌కు రెడ్డి వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి, పరిస్తితి ఎలా మారుతుందో చెప్పలేని పరిస్తితి ఉంది. హుజూరాబాద్‌లో గెలవకపోయిన కనీసం రెండోస్థానంలోనైనా నిలిచి పరువు నిలబెట్టుకోవాలని రేవంత్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక జరుగుతున్న మొదటి ఎన్నిక ఇదే. అందుకే హుజూరాబాద్ పోరుని రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. అంటే హుజూరాబాద్‌లో త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ఈ త్రిముఖ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో?

Read more RELATED
Recommended to you

Latest news