“వడ్డీ” మాటలు కట్టిపెట్టి.. అసలు మాటలు చెప్పవోయ్!

-

ఇప్పుడు ఏమిచేస్తావో చెప్పరా అంటే… నేను లేచానంటే మనిషిని కాదని చెప్పాడంట వెనకటికొకడు. ప్రస్తూతం ఏపీలో టీడీపీ ఆశాకిరణం నారా లోకేష్ మాటలు అలానే ఉన్నాయి. ఇప్పుడు ఆయన సమర్ధత చూడాలంటే.. సీఎం ని చేయాలంట.. పోనీ కనీసం టీడీపీకి అధికారం అయినా అప్పగించాలంట! ఇది అక్షరాలా నిజం… చినబాబు ప్రతీ సందర్భంలో చెబుతున్న వట్టిమాటలు… కాదు కాదు… వడ్డీ మాటలు ఇవే!

nara-lokeshఏపీలో టీడీపీ నాయకులకు ఏ కష్టం వచ్చినా.. పోలీసులు అరెస్టులు చేసినా.. అధికారులు అడ్డుతగులుతున్నా… మైకులముందుకు వచ్చే చినబాబు ప్రతీసరీ చెప్పేమాట ఇదే! “అధికారుల తప్పులన్నీ లెక్కేసుకుంటున్నాం.. తాము అధికారంలోకి వచ్చాక అందరి పని పడతాం.. మేం అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం” అని చినబాబు పదే పదే చెబుతున్నారు.

అధికారంలోకి వచ్చాక సంగతి దేవుడెరుగు సామీ… అధికారంలోకి రావాలంటే ప్రజల పక్షాన్న పోరాడాలి, ప్రజాసమస్యలపై ఉద్యమించాలి. అప్పుడు కదా.. ప్రజలు అధికారం కట్టబెట్టేది! అలా కాకుండా… తమ పార్టీ నేతలపై పోలీసులు స్పందించిన ప్రతిసారీ… మేము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా అని ఈ వట్టిమాటలు ఎందుకు?

అసలు టీడీపీ ఎందుకు అధికారంలోకి రావాలి? రాబోయే ఎన్నికల్లో టీడీపీకి జనం ఎందుకు ఓటెయ్యాలి? రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీకి ఐదేళ్లు అధికారం ఇచ్చారు ఏపీ ప్రజలు. చేసిందేమిటనేది… 2019 ఫలితాల్లో చూపించారు. ఇప్పుడు జగన్ వంతు. జగన్ కు ఐదేళ్లు అధికారం అప్పగించారు ప్రజలు. మరి జగన్ ఇది నిలబెట్టుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి! బాబు ఐదేళ్లు తప్పు చేయడం – మళ్లీ జగన్ కు అధికారం ఇవ్వడం, మళ్లీ జగన్ తప్పులు చేయడం, బాబుకు అధికారం ఇవ్వడం.. ఇదేనా ఏపీ ప్రజల పని!

అలా ఆలోచించకు చినబాబూ అనేది ప్రస్తుతం ఏపీవాసులు ఇస్తున్న సూచనగా ఉంది. జగన్ పాలన నచ్చకపోతే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ తమకే పడతాయని చినబాబు బావిస్తే అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదు! ఆ స్థాయికి రావాలంటే… కేవలం టీడీపీ నాయకుల సమస్యలపై పోరాడటం కాదు.. ప్రజల సమస్యలపై పోరాడాలి – ప్రభుత్వంపై వ్యూహాత్మకంగా ఒత్తిడి తీసుకురావాలి.

అంతేకానీ… కష్టం వచ్చిన ప్రతీసారీ… “వడ్డీతో సహా చెల్లిస్తాం” అనే “వట్టి”మాటల వల్ల జనాలు నవ్వుకునే పరిస్థితి వస్తుందన్న విషయం చినబాబు మరిచిపోకూడదని పలువురు శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news