రాజకీయ నేతలు పార్టీలు మారడం.. నోరు జారడం సహజంగానే చూస్తూ ఉంటాం. అదే ఓ మంత్రి స్థాయిలోని వ్యక్తి నోరి జారితే కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పొరపాటున నోరు జారారు. కేసీఆర్ అనాల్సిన చోట చంద్రబాబు అన్నారు. దీంతో గంగుల కమలాకర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పల్లె ప్రగతిలో భాగంగా శనివారం కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుళ్ల గ్రామంలో చేపట్టిన కార్యక్రమంలో మంత్రి గంగుల పాల్గొన్నారు. మొక్కలు నాటి, మహిళా సంఘ భవనం, గౌడ సంఘ భవనాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గంగుల మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లతో వృద్ధులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇంత మంచి పథకాన్ని అందించిన చంద్రబాబుకు కడుపు నిండా దీవెనలు అందించాలా? వద్దా? అని ప్రశ్నించారు. వెంటనే తన తప్పును గ్రహించి… కేసీఆర్ అని కవర్ చేసారు. కాగా గంగుల కమలాకర్ 2009లో కరీంనగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీకి రాజీనామా చేసి 2013లో టీఆర్‌ఎస్‌లో చేరారు.