గంటకో ‘గంటా’ రాజకీయం…తమ్ముళ్ళు లైట్?

రాజకీయాల్లో ఏ నాయకుడైన ముందు సొంత ప్రయోజనాలు చూసుకున్నాకే…ప్రజా ప్రయోజనాల గురించి పట్టించుకుంటారని చెప్పొచ్చు. ఏదో కొంతమంది మాత్రమే ప్రజలకు ఏదొకటి చేద్దామని ఆలోచిస్తున్నారు గాని…చాలామంది నేతలు సొంత ప్రయోజనాలు ఎక్కువగా చూసుకుంటారు. ఆ నాయకుడు, ఈ నాయకుడు అనే తేడా లేదు…ఎక్కువశాతం అందరూ నాయకులు అలాగే ఉన్నారు. అలాంటి నాయకుల్లో గంటా శ్రీనివాసరావు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. అసలు ఈయన మొదట నుంచి ఓపెన్ గానే సొంత ప్రయోజనాల గురించి చూసుకుంటారు.

అలా చూసుకుంటూనే వరుసపెట్టి పార్టీలు మార్చారు…అలాగే నియోజకవర్గాలు మార్చారు. అయితే ఎప్పుడు కూడా ఈయనకు పరాజయాలు రాలేదు. 1999 ఎన్నికల్లో టీడీపీ తరుపున అనకాపల్లి ఎంపీగా గెలిచారు…ఇక 2004లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీ వదిలి ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. నెక్స్ట్ ప్రజారాజ్యం, కాంగ్రెస్ లో విలీనం కావడంతో మంత్రి కూడా అయ్యారు.

ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోవడంతో 2014 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి…భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికలోచ్చేసరికి విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాకపోతే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో..గంటా వైసీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేశారు. మరి అక్కడున్న కొందరు నేతలు గంటాని వైసీపీలోకి రానివ్వలేదు. దీంతో గంటా టీడీపీలోనే ఉండాల్సి వచ్చింది…అది కూడా అంటీముట్టనట్లుగానే…అటు తన నియోజకవర్గంలో తిరగడం లేదు…ఇటు టీడీపీలో పనిచేయడం లేదు. ఇటీవల చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చి గంటా మనవడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు..కానీ గంటా మాత్రం మినీ మహానాడు కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో గంటా వైఖరి ఏంటి అనేది ఎవరికి అర్ధం కావడం లేదు.

అందుకే టీడీపీ శ్రేణులు సైతం గంటాని లైట్ తీసుకున్నారు. ఇక ఆయన పార్టీలో ఉన్నా, లేకపోయినా ఒకటే అన్నట్లుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గంటాని టీడీపీ శ్రేణులు పట్టించుకోవడం మానేశాయి. ఆయన పార్టీలో ఉన్నా, మారినా ఇబ్బంది లేదన్నట్లుగానే ఉన్నారు. మరి చూడాలి చివరికి గంటా రాజకీయం ఎలా ఉంటుందో.