టిడిపి-జనసేన పొత్తు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. టిడిపి-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందో? ఎవరు ఎన్ని సీట్లు తీసుకుంటారో? ఏ ప్రాంతంలో సీట్లు తీసుకుంటారో? అనే విషయం మీద రాష్ట్రమంతా ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది.
ఇదే క్రమంలో గోదావరి జిల్లాలపై చర్చ ఎక్కువ ఉంది. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కు మంచి పట్టు ఉంది. పవన్ సామాజిక వర్గ ఓట్లే కాకుండా, పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా ఎక్కువమంది ఈ జిల్లాల్లో ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి లో 19, పశ్చిమ గోదావరి లో 15 సీట్లు మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు జిల్లాలలోను కలిపి జనసేన 15 వరకు సీట్లు ఆశిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ 34 సీట్లలో టిడిపికి బలమైన నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఓటింగ్ ఉంది. కంచుకోటలు ఉన్నాయి.
ఇప్పటివరకు టిడిపి నేతలు ఆయా నియోజకవర్గాలలో తమదైన ముద్ర వేయడానికి, పట్టు సాధించడానికి చాలా కష్టపడ్డారు. టికెట్ ఆశించి ఇప్పటికే తమ క్యాడర్ తో సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు టిడిపి జనసేన మధ్య పొత్తు వారి ఆశలపై నీళ్లు జల్లిందని చెప్పవచ్చు. మరి టిడిపి నేతలు అధినేత మాటకు విలువ ఇచ్చి జనసేన కోసం తమ స్థానాలను త్యాగం చేస్తారా లేదా చూడాల్సిందే.!
అలా సీట్లు త్యాగం చేస్తే ఆయా స్థానాల్లో జనసేనకు పట్టు పెరుగుతుంది. దీంతో టిడిపి నేతల హవా తగ్గుతుందనే భయం కూడా ఉంది. అలాంటప్పుడు ఎన్నికల సమయంలో ఓట్లు బదిలీ కూడా కష్టం. మొత్తానికైతే గోదావరి జిల్లాల్లోనే టిడిపి-జనసేన పొత్తులో తలనొప్పులు ఎక్కువ వచ్చేలా ఉన్నాయి.