లీడర్ కావలెను..! ఇలా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ ఓ బోర్డు పెట్టుకోవచ్చు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడ… ఇంకా చెప్పాలంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సొంత గడ్డ… ఆయన కూడా రెండుసార్లు గెలిచిన గుడివాడ ఇప్పుడు మంత్రి కొడాలి నాని అడ్డాగా మారిపోయింది. ఇక్కడ కొడాలి నానిని ఢీకొట్టే నాయకుడే కరువయ్యాడు. 2004,2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన నాని…2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచాడు. అయితే నాని వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఇక్కడ టీడీపీని నడిపించడానికి సరైన నాయకుడు లేడు. 2014లో రావి వెంకటేశ్వరరావు…నాని మీద పోటీ చేసిన ఓటమి పాలయ్యారు.
ఇక మొన్న ఎన్నికల్లో అయితే విజయవాడకు చెందిన దేవినేని వారసుడు అవినాష్ ని టీడీపీ తరుపున బరిలోకి దించారు. అయినా సరే టీడీపీ నానికి చెక్ పెట్టలేకపోయింది. ఎన్నికల్లో ఓడిన అవినాష్ అసలు ఇప్పుడు గుడివాడలో ఉండేందుకు కూడా ఇష్టపడని పరిస్థితి. నాని జైత్రయాత్రకు బ్రేకులు వేయలేకపోయింది. దీనికి కారణం నానికి పార్టీ బలంతో పాటు సొంత కేడర్ కూడా ఉండటం. అదే నాని విజయానికి కారణమవుతోంది.
నాని గుడివాడలో ఉన్నంత కాలం…మరొకరికి విజయం దక్కడం కల్లే. కానీ కనీసం పోటీ అయిన ఇస్తే అది వేరుగా ఉంటుంది. టీడీపీలో ఆ పరిస్తితి అస్సలు కనబడటం లేడు. పైగా నాని ఇప్పుడు మంత్రి అయ్యాక మరింత దూకుడుగా వెళుతున్నారు. దీంతో ఆయనకు అడ్డుకట్ట వేయడం అంత సులువు కాదు. ఇప్పటికే నియోజకవర్గంలోని టీడీపీ నేతలు మొత్తం చప్పబడిపోయి ఉన్నారు. రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకంటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ, యలవర్తి శ్రీనివాసరావు లాంటి నేతలు సైలెంట్ అయిపోయారు.
అటు దేవినేని అవినాష్ విజయవాడకే ఎక్కువ పరిమితవుతున్నారు. అవినాష్ కూడా వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ వంశీ పార్టీ మారితే గన్నవరంలో కూడా దిగొచ్చు. దీంతో నియోజకవర్గంలో టీడీపీకి దిక్కు ఎవరు లేకుండా పోయారు. ఇప్పటికైనా బాబు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి సరైన నాయకుడుని పెట్టకపోతే కంచుకోటలో టీడీపీ అడ్రెస్ గల్లంతు అవ్వడం ఖాయం.