ప్రచారపర్వంలోకి పార్టీల అధినేతలు..!

-

ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో… ప్రచారంపై అన్ని పార్టీల నేతలు దృష్టి సారించారు. అధికార, ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నేతలు ఇప్పటికే ప్రజలకు చేరువయ్యేందుకు యాత్రలు చేస్తున్నారు. ఎన్నికలకు రోజులు దగ్గర పడుతుండటంతో… పార్టీల అధ్యక్షులు సైతం ఎన్నికల కదనరంగంలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఎన్నికల నగారా మోగింది. ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియతో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు రంగంలోకి దిగారు. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పోటీ చేసే అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది.

అధికార వైసీపీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా… ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా ఇప్పటికే 14 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు కూడా. ఆత్మీయ సమావేశాలతో అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.

ఏపీలో ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందు నుంచే ప్రతిపక్షాలు టార్గెట్ ఎలక్షన్ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… ఏడాదికి పై నుంచే బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, రా… కదలి రా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు.

అయితే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మరోసారి నియోజకవర్గాల్లో పర్యటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ బస్సు యాత్ర దాదాపు అన్ని నియోజకవర్గాల్లో రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఈ నెల 25 లేదా 27వ తేదీ నుంచి యాత్ర మొదలయ్యే అవకాశం ఉందటున్నారు పార్టీ నేతలు. ఎన్నికలకు 50 రోజులు పైగా సమయం ఉండటంతో… అన్ని నియోజకవర్గాల్లో తన పర్యటన ఉండేలా చూడాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.

దాదాపు నాలుగేళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితమైన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… గతేడాది కాలంగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో పథకాలను క్యాంపు కార్యాలయం నుంచే ప్రారంభించిన జగన్… ఏడాది నుంచి మాత్రం… జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి… ప్రజల మధ్యలోనే బటన్ నొక్కుతున్నారు. దీని ద్వారా… ప్రజలకు తమ ప్రభుత్వం ఏం చేస్తుందో.. ఏం ఇస్తుందో తెలుస్తుందంటున్నారు వైసీపీ నేతలు.

అయితే ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో… ఈ నెల 27వ తేదీ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 21 రోజుల పాటు యాత్ర సాగేలా ప్లాన్ చేశారు వైఎస్ జగన్. ప్రతి రోజు 3 సభల్లో పాల్గొంటూ… ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సైతం ముఖాముఖి నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ యాత్ర కోసం ఏపీఎస్ ఆర్టీసీ 2 ప్రత్యేక బస్సులను సైతం తయారు చేయించింది. వాటి పై నుంచే జగన్ నియోజకవర్గాల్లో ప్రసగించనున్నారు.

అటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం మరోసారి తన వారాహిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వారాహి యాత్ర నిర్వహించిన పవన్… రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ప్రధానంగా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పవన్ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే… ఆయా నియోజకవర్గాల్లో రాత్రి బస కూడా చేసి… పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చేలా కూడా పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మలి విడత పవన్ వారాహి యాత్రను ఈ నెల 27వ తేదీ నుంచి వారాహి యాత్ర మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన పవన్… అక్కడ నుంచే యాత్ర ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. రాష్ట్రంలో 2 పార్లమెంట్ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు పవన్ తన వారాహి దుమ్ము దులుపుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల సందడి మొదలవ్వడంతో… ప్రధాన పార్టీల నేతలు.. ప్రచారంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే పూర్తిస్థాయి అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్… ఎలాంటి టెన్షన్ లేకుండా మేమంతా సిద్ధం పర్యటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు సైతం… అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే యాత్రలు మొదలుపెట్టనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news