బండి సంజయ్‌ను దెబ్బకొట్టేందుకు సొంత పార్టీ నేతలు భారీ స్కెచ్

-

బీజేపీ జాతీయ నాయకత్వంలో పలుకుబడి కలిగిన నేతలే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని టార్గెట్ చేశారని సొంత పార్టీనేతలే చర్చించుకుంటున్నారు. ఆ నేతల డైరెక్షన్‌లోనే లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం కోసం ప్రగతి భవన్‌ మెట్లు తొక్కారనీ, రాజకీయ కుట్రలో భాగంగానే ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ నేతలను మంత్రి కేటీఆర్ దగ్గరకు పంపించారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క డివిజన్ ఎన్నిక కోసం ముఖ్యనేతలు ప్రగతి భవన్ మెట్లు తొక్కడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందనే అనుమానాలు సొంతపార్టీలోనే వినిపిస్తున్నాయి.


నిజానికి బీజేపీ సారథిగా బండి సంజయ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఉన్న పార్టీ అధ్యక్షులకు భిన్నంగా బండి సంజయ్‌ దూకుడు ప్రదర్శించారు. దీంతో ఆయనకు పార్టీ జాతీయ నాయకత్వం ఫుల్‌ పవర్స్‌ ఇచ్చింది. తనపై మరింత బాధ్యత పెరగడంతో సంజయ్‌ ఇంకా యాక్టివ్‌ అయ్యారు. అందర్నీ కలుపుకుపోతూనే కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఆయనకు వ్యతిరేకవర్గం ఏర్పడింది. అయితే దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో బండి సంజయ్‌కు క్రేజ్‌ పెరిగింది. ఈ పరిస్థితిని ఆయన వ్యతిరేకవర్గం జీర్ణించుకోలేకపోయిందట.

సరైన సమయం కోసం వేచివున్న బండి సంజయ్‌ వ్యతిరేకులకు లింగోజిగూడ డివిజన్‌ ఉపఎన్నిక సందర్భంగా నెలకొన్న పరిస్థితులు అదునుగా మారాయనీ, రాజకీయ కుట్రలో భాగంగానే ఎల్బీనగర్‌ బీజేపీ నేతలను ప్రగతిభవన్‌ మెట్లు తొక్కించేలా చేశారనీ పార్టీ వర్గాల్లో అంతర్గతంగా చర్చ కొనసాగుతోంది. బీజేపీ కేంద్ర నాయకత్వంలో పలుకుబడి కలిగిన ఓకే అన్న తర్వాతే.. ప్రగతి భవన్‌కు బీజేపీ బృందం వెళ్లినట్లు తెలుస్తోంది. సదరు కీలక నేతకు.. కర్మన్ ఘాట్ కార్పోరేటర్ వంగ మధుసూదన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్ల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డిలు సన్నిహితులు కావడంతోనే ఇది‌జరిగినట్లు తెలుస్తుంది.

ఈ అంశంపై సంజయ్‌ చాలా సీరియస్‌గా ఉన్నారట. తనపై కుట్ర చేసినవారిని వదిలే ప్రసక్తే లేదని‌ ఆయన అంటున్నారట. మంత్రి కేటీఆర్ తనను తిట్టినా.. అక్కడే ఉన్న బీజేపీ నాయకులు కలుగజేసుకోకపోవడాన్ని కూడా సంజయ్‌ సీరియస్‌గా పరిగణిస్తున్నారట. టీఆర్ఎస్‌ పై తాను చేస్తోన్న పోరాటాన్ని కావాలనే సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారనే విషయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి బండి సంజయ్‌ తీసుకెళ్లారని తెలుస్తుంది . ముఖ్యనేతల ఆదేశాలతోనే తాము ప్రగతి భవన్‌కు వెళ్లినట్లు కొందరు నేతలు ఒప్పుకున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news