హుజురాబాద్ ఉప ఎన్నిక: విద్యార్థి నుంచి శాసన సభకు పోటీచేసే వరకు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రయాణం ఎలా సాగింది?

హుజూరాబాద్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు బీ-ఫారం అందజేశారు. ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు తథ్యమని, ఎమ్మెల్యేగా హైదరాబాద్‌కు తిరిగి వస్తాడని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్. వీణవంకలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, అంబర్‌పేటలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ దోమలగూడలోని ఏవీ కళాశాలలో బీఏ పూర్తిచేశాడు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ(జానపద కళలు), ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ(రాజనీతిశాస్త్రం), ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. ‘తెలంగాణ ఉద్యమం- కేసీఆర్ పాత్ర’ అనే అంశంపై ఓయూలో పీహెచ్‌డీ చేస్తున్నారు.

మలుపు తిప్పిన ఆర్ కృష్ణయ్యతో పరిచయం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో పరిచయం గెల్లు శ్రీనివాస్ యాదవ్ జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుంచి బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాటాలు మొదలు పెట్టాడు. అంచలంచెలుగా బీసీ విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగాడు

టీఆర్‌ఎస్‌వీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు

2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కావడంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం(టీఆర్‌ఎస్‌వీ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడిగా ఉన్నాడు. 2003-2006 వరకు టీఆర్‌ఎస్‌వీ ఏవీ కళాశాల అధ్యక్షుడిగా, 2006-2007 వరకు టీఆర్‌ఎస్‌వీ తెలుగు విశ్వవిద్యాలయం అధ్యక్షుడిగా ఆ తర్వాత తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2017, మే 29న టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నియామకమయ్యారు.

ఎన్నికల్లో చురుకైన పాత్ర

టీఆర్‌ఎస్‌లో చురుకైన నాయకుడిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు పేరు ఉన్నది. అందుకే, చాలా ఎన్నికల్లో విద్యార్థి విభాగం సమన్వయకర్తగా వ్యవహరించారు. 2006లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విద్యార్థి విభాగం సమన్వర్యకర్తగా పనిచేశాడు. 2008లో జడ్చెర్ల, 2009లో హుజురాబాదు అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థి విభాగం ఇంచార్జ్‌గా పనిచేశాడు. గత ఏడాది జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్ ఇంచార్జ్ గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పని చేశాడు. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌ ఉపఎన్నిక అనివార్యం కావడంతో గత ఆగస్టు11న టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అభ్యర్థితత్వాన్ని సీఎం కే చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు.