ఖచ్చితంగా జగన్ ఈ ఎన్నికల్లో గెలిచేలా వైసీపీ తరుపున జోరుగా ప్రచారం చేస్తానని కమెడియన్ అలీ స్పష్టం చేశారు…
ప్రముఖ హాస్య నటుడు అలీ ఇవాళ వైఎస్సాఆర్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా జగన్.. అలీకి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అయితే.. అలీ గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేస్తారని ఊహాగానాలు వినవచ్చాయి. అయితే… వాటన్నింటినీ కొట్టి పారేసిన అలీ.. వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
జగన్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నా. ఆయన్ను నేను గతంలో కూడా కలిశాను. ఆయనతో చాలాసేపు చర్చించాను. ఆయన నన్ను రమ్మని ఆహ్వానించారు. నేనే కొంచెం సమయం కావాలని అడిగాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. 1999లో ఓ పార్టీలో నేను చేరాను. మళ్లీ ఇప్పుడు 2019 లో వైసీపీలో చేరాను. కచ్చితంగా జగన్ ను సీఎం చేయడమే నాధ్యేయం.. అని అలీ పేర్కొన్నారు.
అయితే.. తాను వైసీపీలో చేరింది ఏదో టికెట్ ఆశించి కాదని… కేవలం పార్టీ తరుపున ప్రచారం నిర్వహిస్తానని అలీ తెలిపారు. వైఎస్ జగన్ కు ముందే ఉన్న కమిట్ మెంట్ల కారణంగా తనకు టికెట్ కేటాయించకపోవచ్చని తెలిపారు. ఒకవేళ టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా అని అలీ స్పష్టం చేశారు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను తాను కలిసిన మాట వాస్తవమేనని.. అయితే వాళ్లను కలిసింది రాజకీయం కోసం కాదు.. వాళ్లకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడానికేనని అలీ చెప్పారు.