పెరిగిన జనసేన గ్రాఫ్..ఎంత శాతం అంటే?

ఏపీలో ప్రతిరోజూ ఎన్నికల యుద్ధం జరుగుతున్నట్లే కనిపిస్తోంది..ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..అయినా సరే రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి.. ప్రజల్లోకి వెళుతున్నారు..ఎన్నికలు హామీలు ఇస్తున్నారు..ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు..మాకు ఒక ఛాన్స్ ఇవ్వాలంటూ అడుగుతున్నారు. అయితే గత ఎన్నికల మాదిరిగా ఇప్పుడు వైసీపీకి పూర్తి అనుకూల వాతావరణం లేదు.

ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది..కానీ జగన్ మాత్రం మనం ప్రజలకు మంచి చేశాం కాబట్టి..175కి 175 సీట్లు గెలిచేయాలని అంటున్నారు. అయితే వాస్తవ పరిస్తితులు వేరుగా ఉన్నాయి..175 కాదు కదా..గెలవడానికి అవసరమైన 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే చాలు. అంటే పోటీ బాగా టఫ్ అయింది. వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తుంది..రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం. కాకపోతే ఈ పోరులో జనసేన కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే గత ఎన్నికలతో పోలిస్తే జనసేన గ్రాఫ్ పెరిగింది.

ప్రజా సమస్యలపై పవన్ పోరాటాలు, పవన్‌పై సానుభూతి పెరగడం, ఇక వైసీపీ వ్యతిరేక ఓట్లు మొత్తం టీడీపీకే కాకుండా జనసేన వైపుకు కూడా వస్తున్నాయి. దీంతో జనసేన బలం పెరిగిందని ఇటీవల కొన్ని సర్వేల్లో తేలింది. గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీ బలం తగ్గుతుండగా, టీడీపీ బలం స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జనసేన బలం ఆ రెండు పార్టీలకు కంటే కాస్త ఎక్కువగానే పెరిగినట్లు కనబడుతోంది.

గత ఎన్నికల్లో జనసేనకు 6 శాతం ఓట్లు, ఒక సీటు వచ్చింది. కానీ ఇప్పుడు జనసేన ఓటు బ్యాంక్ 10 శాతం వరకు పెరిగిందని అంచనా వేస్తున్నారు. అలా అని ఆ పార్టీకి 10 సీట్లు గెలిచుకునే బలం రాకపోవచ్చు. కానీ 50 సీట్లలో గెలుపోటములని తారుమారు చేసే బలం ఉంది. ఈ ప్రభావం టీడీపీపైనే ఎక్కువ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని టీడీపీ-జనసేన చీల్చుకుంటే..ఆటోమేటిక్‌గా వైసీపీకే లాభం. ఆ పార్టీ ఓటు శాతం తగ్గిన..టీడీపీ-జనసేన కంటే మెరుగైన ఓటు బ్యాంక్ ఉంటుంది. అలా కానుందా ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీకి రిస్క్. అయితే బీజేపీ..జనసేనని టీడీపీతో కలవకుండా చేయడమే లక్ష్యంగా చూస్తుంది. మరి చూడాలి పొత్తుపై ఏం తేలుతుందో.