ఈ మధ్య పుట్టినరోజు వేడుకల్లో కొందరు అత్యుత్సాహం చూపిస్తున్నారు. పెద్ద పెద్ద కత్తులు ప్రదర్శించడం వంటివి చేసి..వాటిని ఫోటోలు తీసి..సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అది కాస్తా పోలీసులకు దొరికి వారిని అరెస్ట్ చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి.. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పుట్టిన రోజు వేడుకలు ఆయన స్వస్థలం చింద్వారాలో ఘనంగా జరిగాయి. నిజానికి ఆయన బర్త్ డే నవంబర్ 18న కానీ, ఆరోజు ఆయన అక్కడ ఉండడం లేదు కనుక బుధవారమే అభిమానులు వేడుకలు నిర్వహించారు.
ఆ బర్త్ డే వేడుకల్లో కమల్ నాథ్ కట్ చేసిన కేక్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఆ కేక్ హిందూ దేవాలయ ఆకారంలో ఉంది. నాలుగు అంతస్తులుగా, పైన కాషాయ జెండా, హనుమాన్ బొమ్మతో ఆ కేక్‌ను అలంకరించారు. కమల్ నాథ్ కేక్ కట్ చేసిన తరువాత వేడుకలు కొనసాగాయి. అంతా బాగానే ఉంది, కానీ, గుడి ఆకారంలో ఉన్న కేక్‌ను కమల్ నాథ్ కట్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. తాను హనుమాన్ భక్తుడినని కమల్ నాథ్ చెప్పడం ఆ వీడియోలో రికార్డ్ అయింది.
మండి పడ్డ బీజేపీ..
గుడి ఆకారంలో ఉన్న కేక్‌ను కట్ చేయడంపై బీజేపీ, ఇతర హిందూ సంఘాల నేతలు కమల్ నాథ్‌పై మండి పడుతున్నారు. దొరికిందే ఛాన్స్‌ను ఇచ్చిపడేశారు..కమల్ నాథ్‌కు, కాంగ్రెస్‌కు హిందూ ధర్మం పట్ల గౌరవం లేదని, హిందూ ధర్మాన్ని అవమానించారని విరుచుకుపడ్డారు. అది హిందువులను అవమానించడమేనని మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. హనుమాన్ భక్తులమని చెబుతూ.. అదే హనుమాన్ బొమ్మను కేక్‌పై అలంకరించి కట్ చేయడం ఏంటని మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని నమ్మే ఎవరైనా అలా చేస్తారా? అని ప్రశ్నించారు. ఏదీ ఏమైనా ఇప్పుడు ఈ వీడియోపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.