విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అతి పెద్ద టీడీపీలో ఒంటరి పోరు చేస్తున్నారా? ఆయనకు విజయవాడ నగరంలో కలిసి వచ్చే నాయకుడు ఎవరూ కనిపించడం లేదా? పార్టీ తరఫున ఆయన వినిపిస్తున్న గళాన్ని సమర్ధించే నాయకుడు కూడా లేరా? అంటే.. తాజా పరి ణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. చదివింది తక్కువే అయినా.. రాజకీయంగా మంచి పరిజ్ఞానం సంపాయించుకున్న నాయకుడు కావడం, కనక దుర్గ ఆలయం ముందు ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఉద్యమాలు చేసిన నేపథ్యంలో టీడీపీలో అనూహ్య గుర్తింపు పొందారు బుద్దా.
ఈ క్రమంలోనే విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించా రు. ఇక, తర్వాత కాలంలో ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ.. 2014లో పార్టీ అధి కారంలోకి వచ్చిన తర్వాత జిల్లా రాజకీయాల్లో అప్పటి మంత్రి దేవినేని హవా ఎక్కువైంది. ఇక, నగరంలో ఎంపీ కేశినేని, అప్పటి ఎమ్మెల్యే బొండా ఉమా హవా నడిచింది. ఇద్దరూ కూడా నగరాన్ని పంచుకున్నారా? అనే రేంజ్‌లో రాజకీయాలు సాగాయి.
వీరిద్దరికీ తోడు అప్పటి మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా విజయవాడ నగర రాజకీయాల్లో వేలు పెట్టారు. అంతా ఆయన కనుసన్నల్లోనే సాగింది. ఫలితంగా బుద్దా హవాకు బ్రేకులు పడ్డాయి. అయితే, ఆయన ఫైర్ బ్రాండ్‌గా మారి టీడీపీ తరఫున గళం వినిపిస్తుండడం, ప్రతిపక్షంపై విమర్శలు చేయడం, లోకేష్ కోసం ఎమ్మెల్సీని త్యాగం చేస్తానని చెప్పడం వంటివి ఆయనకు ప్లస్‌గా మారాయి. కట్ చేస్తే.. 2019 ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. అప్పటి నుంచి విజయవాడలో మళ్లీ సంపాయించుకునేందుకు బుద్దా ప్రయత్నిస్తున్నారు.
అయితే, ఎంపీగా కేశినేని నాని మరోసారి గెలుపు గుర్రం ఎక్కడంతో.. ఆయన తనహవాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకానొక సందర్భంలో బుద్దా వర్సెస్ కేశినేని తీవ్ర విమర్శలు చేసుకున్నారు. బీసీ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో బుద్దానే వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఇక, ఇప్పుడు పరిస్థితి చూస్తే.. బుద్దాతో ఎవరూ సఖ్యతగా లేరనేది వాస్తవం. అంతేకాదు, పార్టీలో ఎవరూ కూడా ఆయనను విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడిగా కూడా గుర్తించడం లేదని సంచలన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు ఆయన పార్టీ తరఫున ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించ లేదు. దీని వెనుక నాయకుల సహకారం లేదనేది నిర్వివాదాంశంగా చెబుతున్నారు. మరో రెండు మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలో వైసీపీ బలంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో బుద్దా ను తప్పించి బలమైన వ్యక్తిని రంగంలోకి దింపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం విజయవాడ టీడీపీలో ఆసక్తికరంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.