ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దూకుడు మీదున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్….తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో ప్రతి గల్లీ తిరగుతున్న విషయం తెలిసిందే. కాషాయ కండువా కప్పుకున్న మరో క్షణం నుంచే హుజూరాబాద్‌లో ప్రజల అందరినీ కలిసే పనిలో పడ్డారు. ఎలాగైనా ఉపఎన్నికలో గెలిచి తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్నారు. అటు అధికార టీఆర్ఎస్ సైతం ఈ ఉప పోరులో ఈటలకు చెక్ పెట్టాలని చూస్తుంది.
ఇలా అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య పెద్ద ఫైట్ జరగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు హుజూరాబాద్‌లో ఎంట్రీ ఇచ్చి రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హుజూరాబాద్‌లోనే మకాం వేసి, ఈటలకు సపోర్ట్‌గా ఉంటున్నారు. అయితే ఈటల గెలుపుపై బండి సంజయ్ బాగా కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. గెలుపు విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉండటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు గానీ, టీఆర్ఎస్‌కు డిపాజిట్లు రావని చెప్పడం ఓవర్ కాన్ఫిడెన్స్‌గానే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు అభ్యర్థి కరువయ్యారని, అక్కడ వార్ వన్‌సైడే అని, కాషాయ జెండా ఎగరడం ఖాయమని, కోట్లు ఖర్చుపెట్టినా టీఆర్‌ఎస్‌కు డిపాజిట్ దక్కదని సంజయ్ కామెంట్ చేశారు. ఇలా సంజయ్ మాటలు చూస్తుంటే హుజూరాబాద్‌లో గెలుపు విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారని అర్ధమవుతుంది. మొన్నటివరకు ఈటల టీఆర్ఎస్‌లోనే ఉండి వెళ్లారు.
ఇప్పుడు ఈటల బీజేపీలోకి వచ్చిన టీఆర్ఎస్ కేడర్ పూర్తి స్థాయిలో బీజేపీలోకి రాలేదు. పైగా ఇక్కడ ముందు నుంచి బీజేపీకి సొంతంగా బలం లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోలేదు. కేవలం ఈటల బలం మీద ఆధారపడే హుజూరాబాద్‌లో బీజేపీ నడుస్తుంది. అలాంటిది టీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావనే మాటలు కాస్త ఓవర్ గానే ఉన్నాయనే విమర్శ వస్తుంది. చూడాలి మరి సంజయ్‌ది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది.