ఈటల రాజేందర్ కు కేసీఆర్ ఛాన్స్ ఇస్తున్నారా?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా మంత్రి పదవి నుంచి తొలగించబడ్డ ఈటల రాజేందర్, కాషాయ కండువా కప్పుకుని హుజూరాబాద్‌లో రాజకీయాలని వేడెక్కించారు. అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కేసీఆర్‌కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తన రాజీనామాతో  హుజూరాబాద్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.

ఈ ఉపపోరులో టీఆర్ఎస్‌ని ఓడించి తన సత్తా ఏంటో చూపిస్తానని ఈటల రాజేందర్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో ప్రజలని కలుసుకుంటున్నారు. ప్రతి గడపకు వెళ్ళే విధంగా ఈటల సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో కేసీఆర్, ఈటలకు కాస్త ఛాన్స్ ఇచ్చినట్లే కనబడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ కంటే ఈటలనే దూకుడుగా ఉన్నారు.

బీజేపీలో చేరిన దగ్గర నుంచి ప్రతిరోజూ హుజూరాబాద్‌లో ఏదొక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. తన బలం ఇంకా పెంచుకునే పనిలో పడ్డారు. అయితే ఈటల ఇలా దూకుడుగా ఉంటే, టీఆర్ఎస్ ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. కాకపోతే ఇప్పటికే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వరుస పర్యటనలు చేస్తున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నారు. ఈటలపై వరుసపెట్టి విమర్శలు చేస్తున్నారు. కానీ ఇలా విమర్శలు చేసేవారంతా ఉద్యమకారులు కాదని బీజేపీ కౌంటర్ ఇస్తుంది.

ముఖ్యంగా మంత్రి గంగుల కమలాకర్ విషయంలో బీజేపీ పార్టీ విమర్శలు చేస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో గంగుల ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసని మాట్లాడుతున్నారు. ఇక అలాంటి వ్యక్తి మంత్రి అయ్యి, ఇప్పుడు ఈటలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

ఈటల నిజమైన ఉద్యమ కారుడు అని, ఆయన్ని ప్రజలే గెలిపించుకుంటారని చెబుతున్నారు. ఇలా టీఆర్ఎస్‌కు ఎక్కడకక్కడ చెక్ పెట్టేందుకు కమలదళం ప్రయత్నిస్తుంది. ప్రస్తుతానికి ఉన్న రాజకీయ పరిస్థితులని చూస్తే హుజూరాబాద్‌లో ఈటల పుంజుకోవడానికి కేసీఆర్ కాస్త ఛాన్స్ ఇచ్చినట్లే కనిపిస్తుందని అంటున్నారు. మరి చూడాలి ఎన్నికల సమయానికి కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయో?