ఏపీ సీఎం జగన్ ఆషామాషీ వ్యక్తి ఏమి కాదు. ఎవరిని ఎక్కడ నొక్కాలో, ఎవరిని ఎలా వంచాలో బాగా తెలిసిన వ్యక్తి. తన రాజకీయ జీవితంలో ఎన్నో చక్ర బంధాలను దాటుకుని మరి సీఎం స్థానంలో కూర్చున్నారు. తాను అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి తప్ప… రాజీపడే ప్రసక్తే లేదనే మనస్తత్వానికి జగన్ ఉదాహరణ. ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం పై పెద్ద రచ్చ చర్చ జరుగుతూనే వస్తున్నాయి. మార్చిలో ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ కాబోతున్న నేపథ్యంలో, తన హయాంలో ఏదోరకంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ ఆయన టిడిపికి అనుకూలమైన వ్యక్తి అని, ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తారనే కారణంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిమ్మగడ్డ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా , వైసీపీ ప్రభుత్వం దాన్ని తిప్పికొడుతూ వస్తోంది.
గతంలో చీఫ్ సెక్రటరీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య లేఖల వార్ కూడా నడిచింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని, ఉద్యోగులు కోవి డ్ విధుల్లో ఉన్నారు అని సి ఎస్ నిమ్మగడ్డకు లేఖ కూడా పంపారు. ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లగా, ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ దాఖలు చేసింది. జనవరి , ఫిబ్రవరి నెలల్లో వ్యాక్సినేషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను, ఏపీ ప్రభుత్వం హై కోర్టులో ప్రస్తావించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులందరూ కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉందని, ప్రజలకు వాక్సిన్ వేయించడం లో బిజీగా ఉంటారని, సుప్రీం కోర్టు కూడా ఇదే చెప్పిందని, హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది పేర్కొనడంతో పాటు, ఇటువంటి కీలక సమయం ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టడం సరికాదంటూ కోర్టులో వాదనలు వినిపించగా, నిమ్మగడ్డ లాయర్ దీనిపై ఏం సమాధానం చెప్పాలో తెలియక కౌంటర్ దాఖలుకు మరికొంత కాలం గడువు కోరినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టంలేక రకరకాల కారణాలు చెబుతూ వచ్చినా, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అంశాన్ని ప్రస్తావించడంతో నిమ్మగడ్డ సైతం ఇరుకున పడ్డట్టు అయింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పైచేయి సాధించే అవకాశం కనిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్ పేరు చెప్పి నిమ్మగడ్డ పదవీకాలం ముగిసే వరకు ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ఆలోచన ప్రభుత్వం చేయదు. మరి ఈ విషయంలో నిమ్మగడ్డ కోర్టులో ఏ విధంగా కౌంటర్ దాఖలు చేసి జగన్ కు ఝలక్ ఇస్తారో చూడాలి.