భారతీయ జనతాపార్టీ తెలంగాణ శాఖ తమ పార్టీని పట్టించుకోవడంలేదని, నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆ పార్టీకి మరో షాకివ్వడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్నరోజే టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మద్దతు ప్రకటించి బీజేపీకి షాకిచ్చారు. బీజేపీ తెలంగాణ శాఖ తీరుతోనే ఈ నిర్ణయం తీసుకన్నానన్న పవన్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఎవరికి వారే.. యమునా తీరే!
నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థి కోసం తెలంగాణ బీజేపీ కసరత్తులు చేస్తున్న వేళ… జనసేన కూడా అక్కడ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం. ఇరుపార్టీల మధ్య సఖ్యత లేకపోగా ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి తరుణంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన కమిటీని ప్రకటించడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతివ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు మద్దతునిచ్చి… ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతునివ్వడమేంటని ప్రశ్నించారు. ఏవైనా ఇబ్బందులుంటే.. తమ దృష్టికి తీసుకురావాల్సిందని వ్యాఖ్యానించారు. అంటే ఇరుపార్టీల మధ్య సఖ్యతలేదని సంజయ్ మాటలనుబట్టే అర్థమవుతోంది.
అంతరం పెరగడానికి కారకులెవరు?
పవన్, సంజయ్ వ్యాఖ్యలనుబట్టి బీజేపీ – జనసేన మధ్య అంతరం బాగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, డీకే అరుణలాంటి నేతలు జనసేనతో పొత్తు విషయమై చేసిన చులకన వ్యాఖ్యలు పవన్‌కల్యాణ్‌ను నొచ్చుకునేలా చేశాయని ఇరుపార్టీల నేతలు భావిస్తున్నారు. జనసేనతో అసలు తమకు పొత్తే లేదని జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ధర్మపురి అరవింద్ కామెంట్ చేశారు. డీకే అరుణ కూడా ఇంచుమించు ఇలాగే మాట్లాడారు. నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ… ఓట్లు చీల్చకూడదన్న ఉద్దేశంతో, బీజేపీ విజ్ఞప్తి మేరకు పవన్ కల్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీచేయడం మానుకుంటే పదే పదే ఇదే అలవాటైపోతుందని, బీజేపీ కోసం త్యాగాలు చేయడం ఆపాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన నేతలు పవన్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో తెగదెంపులే సరైన నిర్ణయమని జనసేనాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైమైనా కొద్దిరోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం కనపడుతోంది.