అధికార వైసీపీలో దూకుడుగా ఉండే మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి డ్రా పేరుతో వైసీపీ సత్తెనపల్లిలో వసూళ్లకు పాల్పడిందని, మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో లక్కీ డ్రా టికెట్లు బలవంతంగా అమ్మకాలు చేశారని, దీనిపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం మంత్రిపై కేసు నమోదు చేయకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు హైకోర్టుని ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉంటే ఇటీవల మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం నుంచి లంచం అడిగారని ఆరోపించారు. ఇక గతంలో రాంబాబుపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయో తెలిసిందే. అయితే పవన్ టార్గెట్ గా విరుచుకుపడే రాంబాబుకు చెక్ పెట్టాలని జనసేన గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇదే క్రమంలో రాంబాబు లక్ష్యంగా పలు ఆరోపణలు చేస్తున్నారు.
అలాగే వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లిలో అంబటిని ఓడించాలని చూస్తున్నారు. అయితే టీడీపీతో పొత్తులో భాగంగా సత్తెనపల్లి సీటుని జనసేన తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. ఎలాగో సత్తెనపల్లి సీటు కోసం టీడీపీలో రచ్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి సీటుని జనసేనకు కేటాయిస్తారని తెలుస్తోంది. ఇక టీడీపీతో పొత్తులో జనసేన పోటీ చేసి అంబటికి చెక్ పెట్టాలని చూస్తుంది. చూడాలి మరి అంబటికి జనసేన చెక్ పెట్టగలదో లేదో.