కామారెడ్డిలో కారుకు కాంగ్రెస్ చెక్..గంపకు ఈ సారి డౌటే!

-

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గం…ఒకప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అడ్డాగా ఉన్న స్థానం..ఇక్కడ పోటాపోటిగా రెండు పార్టీలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 1952లో ఏర్పడిన ఈ స్థానంలో 1983 ముందు వరకు ఆరుసార్లు గెలిచింది. ఇక 1983 నుంచి టి‌డి‌పి హవా మొదలైంది. 1983, 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచింది. మధ్యలో 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.

ఇక 2012 ఉపఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా బి‌ఆర్‌ఎస్ గెలుస్తూ వస్తుంది. బి‌ఆర్‌ఎస్ నుంచి గంప గోవర్ధన్ గెలుస్తూ వస్తున్నారు. గతంలో ఈయన టి‌డిపిలో పనిచేశారు. 1994, 2009 ఎన్నికల్లో గోవర్ధన్ టి‌డి‌పి నుంచే గెలిచారు. కానీ తర్వాత టి‌డి‌పి వదిలి..బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2012లో ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు.

ఇక 2014, 2018 ఎన్నికల్లో వరుసగా బి‌ఆర్‌ఎస్ నుంచి గెలిచారు. ఇలా వరుసగా గెలుస్తున్న గంపకు ప్రస్తుతం కామారెడ్డిలో పూర్తి స్థాయిలో పాజిటివ్ కనిపించడం లేదు. కొంతమేర వ్యతిరేకత కనిపిస్తుంది..అటు వరుసగా ఓడిపోతున్న కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై సానుభూతి కనిపిస్తుంది. వరుసపెట్టి ఆయన ఓడిపోతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో గెలుపు దగ్గరకు వచ్చి దెబ్బతిన్నారు. కేవలం 5 వేల ఓట్ల తేడాతో అలీ ఓడిపోయారు.

అదే సమయంలో ఇక్కడ బి‌జే‌పికి 15 వేల ఓట్లు వరకు పడ్డాయి. అంటే అప్పుడే ఓట్ల చీలిక జరిగిందని చెప్పవచ్చు. ఈ సారి కూడా కామారెడ్డి లో బి‌జే‌పి బలపడుతుంది. అటు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడేలా ఉన్నాయి. ఈ సారి ఎన్నికల్లో త్రిముఖ పోరు జరిగేలా ఉంది. ఈ పోరులో కాంగ్రెస్, బి‌జే‌పిల మధ్య ఓట్లు చీలితే మళ్ళీ బి‌ఆర్‌ఎస్ పార్టీకి బెనిఫిట్. మరి ఈ సారి కామారెడ్డిలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news