ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఆరు స్థానాలకు ఆరు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఆరుగురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఎన్నికల కమిషనర్ ప్రకటనే తరువాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. తొమ్మిది జిల్లాల్లో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, నిజామాబాద్ ఎమ్మెల్సీ సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇక్కడి సిట్టింగ్ అభ్యర్థి కల్వకుంట కవిత మళ్లీ పోటీపై అనాసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. రాజ్యసభ సభ్యు బండా ప్రకాష్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనుండటంతో కవితను పెద్దల సభకు పంపించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని బండా ప్రకాష్‌ను సీఎం కేసీఆర్ మండలికి ఎంపిక చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ఇంకా రెండేండ్లు ఉన్నది. ఎమ్మెల్సీగా బండా ప్రకాష్ ఎంపిక పూర్తికాగానే మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సంఖ్యా బలం దృష్ట్యా రాజ్యసభ సీటు టీఆర్‌ఎస్ ఖాతాలోనే పడుతుంది. కాబట్టి, ఎమ్మెల్సీ పట్ల అనాసక్తి వ్యక్తపరుస్తున్న కవితను ఎగువ సభకు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
2022, జూన్‌లో మరో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు పదవీ విరమణ చేయనున్నారు. చాలా కాలంగా టీఆర్‌ఎస్, కేసీఆర్‌కు డి.శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రిటైన్ చేయడం దాదాపు అసాధ్యం. వయస్సు రీత్యా కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు సైతం రిటైన్ దక్కే అవకాశం లేనట్లే. ఈ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కల్వకుంట్ల కవితను పెద్దల సభకు పంపే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తున్నది. భవిష్యత్తులో పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌కు ఆమెనే సారథ్యం వహించినా ఆశ్చర్యపోనావసరం లేదు.