ఆ ఇద్దరు కమ్మ నేతలకు కేసీఆర్ హ్యాండ్ ఇచ్చినట్లేనా!

ఒకప్పుడు తెలంగాణలో కమ్మ నేతలు తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా కనిపించేవారు. కానీ తెలంగాణలో ఆ పార్టీ క్లోజ్ అయ్యాక కమ్మ నేతలు చాలామంది టీఆర్ఎస్ గూటికి వెళ్లారు. అయితే గులాబీ గూటికి వెళ్లిన కమ్మ నేతలకు మొదట్లో కేసీఆర్ బాగానే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కానీ నిదానంగా గులాబీ పార్టీలో కమ్మ నేతల హవా తగ్గినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకులుగా ఉన్న కమ్మ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావులు టీడీపీలో సైలెంట్ అయిపోయారు.

తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ ఇద్దరు నేతలు రాజకీయాల్లో కనిపిస్తున్నారు. అయితే 2014లో టీడీపీ తరుపున ఖమ్మం అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల, తర్వాత గులాబీ పార్టీలోకి వచ్చేశారు. ఈ క్రమంలోనే 2016 పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించి, కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా తుమ్మల పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఓడిపోయాక పార్టీలో తుమ్మల యాక్టివ్‌గా ఉండటం తగ్గించేశారు. అదే సమయంలో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ టీఆర్ఎస్‌లోకి వచ్చారు. దీంతో తుమ్మలకు కాస్త ప్రాధాన్యత తగ్గింది. కాకపోతే ఫ్యూచర్‌లో తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. అలాగే కేబినెట్‌లోకి తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తుమ్మలకు కేబినెట్ బెర్త్ దక్కడం కష్టమని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ ఏమన్నా దక్కుతుందేమో చూడాలి.

అటు మండవ సైతం దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేశారు. ఇక తెలంగాణ వచ్చాక టీడీపీలోనే ఉన్నా, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్, మండవ ఇంటికెళ్ళి మరీ టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చారు. అప్పుడు నిజామాబాద్‌లో కవిత గెలుపు కోసం మండవని పార్టీలోకి తీసుకొచ్చారు. కానీ కవిత ఓటమి పాలయ్యారు. ఇక ఆ ఎన్నికలైన దగ్గర నుంచి మండవ పార్టీలో కనిపించడం లేదు. కేసీఆర్ కూడా మండవకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. మరి భవిష్యత్‌లో తుమ్మల, మండవలకు ఏమైనా పదవులు ఇస్తారో? లేక హ్యాండ్ ఇస్తారో? చూడాలి.