కరెక్ట్‌గా 2018 తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సీన్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే..కేసిఆర్ తన పదునైన వ్యూహాలతో ప్రతిపక్షాలని చిత్తుగా ఓడించారు. మొదట కాంగ్రెస్-టిడిపి పొత్తుని ఫుల్ గా అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. చంద్రబాబు ద్వారా ఆంధ్రా పెత్తనం మళ్ళీ తెలంగాణలో వస్తుందని ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ లో బలమైన నేతలని చెక్ పెట్టేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకెళ్లారు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి లాంటి బడా నేతలకు చెక్ పెట్టారు.
ముఖ్యంగా గెలిచేస్తారని అనుకున్న రేవంత్ రెడ్డిని కొడంగల్ లో ఓడించారు. మంత్రి హరీష్, కేటిఆర్ వ్యూహాలతో కొడంగల్ లో సక్సెస్ అయ్యారు. అదే మాదిరిగా ఈ సారి ఎన్నికల్లో కొందరు కీలక నేతలకు చెక్ పెట్టాలని కేసిఆర్ చూస్తున్నారని, అందులో రేవంత్ రెడ్డి, బిజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు తాను ఉన్నానని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. తాను పోటీచేసే నియోజకవర్గంతోపాటు పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పోటీ చేసే నియోజకవర్గాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇబ్బందులకు గురి చేస్తారని తెలిపారు.
అంటే పొంగులేటిని ఓడించడానికి కేసిఆర్ సూపర్ స్కెచ్ తో ముందుకొస్తున్నారని తెలుస్తోంది. కానీ ఇంతవరకు పొంగులేటి ఎక్కడ పోటీ చేస్తారో క్లారిటీ లేదు. కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం సీట్ల కోసం మాత్రం దరఖాస్తు చేసుకున్నారు. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని అంటున్నారు. అయితే పొంగులేటి దాదాపు కొత్తగూడెంలోనే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
అక్కడ కాంగ్రెస్ బలంగానే ఉంది..ఇటు పొంగులేటికి బలమైన అనుచరగణం ఉంది. అలాగే బిఆర్‌ఎస్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. మరి చూడాలి పొంగులేటికి బిఆర్‌ఎస్ చెక్ పెడుతుందో లేదో.